Brazil Covid-19 News: బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగం..మార్చి నెలలో మరణాల సంఖ్య తెలిస్తే షాకే

|

Apr 02, 2021 | 11:25 AM

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అంతకు ముందు మాసాలతో పోలిస్తే మార్చి మాసంలో ఆ దేశంలో నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య రెండింతలు కావడం ఆందోళనకర పరిణామం.

Brazil Covid-19 News: బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగం..మార్చి నెలలో మరణాల సంఖ్య తెలిస్తే షాకే
Covid-19 Deaths
Follow us on

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ బారినపడి ఒక్క మార్చి మాసంలో మాత్రమే ఏకంగా 66,570 మంది మృత్యువాతపడ్డారు. అంతకు ముందు మాసాలతో పోలిస్తే మరణాల సంఖ్య రెండింతలు కావడం ఆందోళనకర పరిణామం. ప్రతి రోజూ ఆ దేశంలో దాదాపు 3800 మంది కరోనా కాటుకు మృతి చెందగా…90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కరోనా మరణాల్లో నాలుగో వంతు ఒక్క బ్రెజిల్‌లోనే నమోదవుతోంది. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతుండటంతో…సావో పాలో రాష్ట్రంలోని విలా ఫార్మొసా శ్మశానవాటికతో పాటు మరో మూడు శ్మశానవాటికలకు భారీ సంఖ్యలో మృతదేహాలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ అనుమతి మేరకు అక్కడ రాత్రి 10 గం.ల వరకు శవాలను ఖననం చేస్తున్నారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో విఫలం చెందినందుకు బెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాస్త ఆలస్యంగా మేలుకున్న బొల్సొనారో సర్కారు…కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ దేశంలో కీలక నేతల రాజీనామాల పరంపర గత వారం రోజులుగా కొనసాగుతోంది. బ్రెజిట్ దేశ రక్షణ శాఖ మంత్రి ఫెర్నాండోపై మంగళవారం వేటు వేయడానికి నిరసనగా ఆ దేశ త్రివిధ దళాధిపతులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు.

కరోనా ఉధృతిని అంగీకరించిన బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో…దీని కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద శత్రువులు కరోనా వైరస్, నిరుద్యోగ సమస్యలుగా ఆయన పేర్కొన్నారు. వీటిపై తప్పకుండా విజయం సాధించితీరుతామని ఆయన బుధవారం ధీమా వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి..India Corona Cases Updates: భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు..

Coronavirus: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 965 పాజిటివ్‌ కేసులు..