Boat Accident: రోడ్డు ప్రమాదాలే కాకుండా నది జలాల్లో పడవ ప్రమాదాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధిక లోడు, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల పడవలు మునిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నైజిరియాలో ఓ పడవ ప్రమాదం జరిగి 150 మంది ప్రయాణికులు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే పడవలో ఉన్న 150 వరకు గల్లంతైనట్లు ప్రకటించిన అధికారులు.. తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు. ఈ పడవ ప్రమాదంలో 60 మంది వరకు మృతి చెందినట్లు వెల్లడించారు. మరో 83 మంది గల్లంతైనట్లు తెలుపగా, వారు కూడా చనిపోయే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని సెంట్రల్ నైజర్ రాష్ట్రం నుంచి వాయువ్య కేబ్బి రాష్ట్రానికి పడవ వెళ్తుండగా ప్రమాదవశాత్తు నైజీర్ నదిలో మునిగిపోయింది. అయితే పడవలో సామర్థ్యం కంటే ఎక్కువ ప్రయాణికులు ఎక్కించారని నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ స్థానిక మేనేజర్ యూసుఫ్ బిర్మా మీడియాకు వెల్లడించారు.
పడవలో 160 మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నైజర్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అధ్వాన్నంగా ఉండే పడవలు, నదీ జలాల్లో పేరుకుపోయిన మట్టి దిబ్బలను పడవలు ఢీకొట్టడం, ఇతర కారణాల వల్ల నైజర్‌పై తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
కాగా, నైజీరియా దేశంలోని ఇలాంటి పడవ ప్రమాదాలు భారీగానే జరుగుతున్నాయి. నదిలో ప్రమాదానికి గురైన పడవ పాతదని, ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించారని ఆయన తెలిపారు. మాలేలోని మార్కెటుకు ప్రయాణికులు వెళుతుండగా ఈ పడవ ప్రమాదం జరిగింది.