
కృత్రిమ మేధపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను రూపొందించిన సంస్థలకు మంచి ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ డిజిటల్ ఏజెంట్, పర్సనల్ ఏఐ అసిస్టెంట్ వంటి వాటికి వినియోగదారుల నుంచి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఏదైనా కంపెనీ అలాంటి సాంకేతికతను తీసుకొస్తే యూజర్లు గూగుల్, అమెజాన్ వంటి వాటిని వినియోగించడం మానేస్తారని అభిప్రాయపడ్డారు. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ నిర్వహించిన ఏఐ ఫార్వార్డ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పర్సనల్ ఏఐ అసిస్టెంట్ రేస్‌లో ఎవరైతే ముందుంటారో వారినే వినియోగదారులు ఎక్కువగా ఆదరిస్తారన్న బిల్‌గేట్స్.. అలాంటి సాంకేతికత యూజర్లకు అందుబాటులోకి వస్తే గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్ లేదా అమెజాన్ వంటి ఉత్పత్తులను విక్రయించే వెబ్‌సైట్‌లను పూర్తిగా మర్చిపోతారని తెలిపారు. యూజర్ అవసరాలకు తగ్గట్లుగా పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌లు ముందుగానే గుర్తించి ఫలితాలను వెల్లడిస్తాయని.. దాంతోపాటు యూజర్ చదవలేని వాటిని ఏఐ చదివి వినిపిచడంతోపాటు, యూజర్ రోజువారీ ఇచ్చే కమాండ్‌లను అర్థం చేసుకుని సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు జీపీటీ తరహా సాంకేతికతపై దృష్టి పెట్టాయని.. వాటిని మరింతగా అభివృద్ధి చేసి పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌ల స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం