బంగ్లాదేశ్ లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువులపై, హిందూ ఆలయాలపై వరస దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు హిందూ సన్యాసులను అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు. గత వారంలో అరెస్ట్ అయిన సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బెయిల్ కేసు ఈ రోజు కోర్టులో విచారణ రానుంది. అయితే ఇలా విచారణకు రావడానికి 24 గంటల ముందు సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్‌పై మళ్లీ కేసు నమోదైంది. ఈసారి కూడా చిన్మోయ్ కృష్ణ దాస్ సహా మొత్తం 71 మందిపై నాన్ బెయిలబుల్ క్లాజ్ కింద కేసు నమోదు చేశారు. చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో సోమవారం కొత్తగా కేసు నమోదైంది. ఇనాముల్ హక్ చౌదరి అనే స్థానికుడు నాన్ బెయిలబుల్ సెక్షన్‌తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశాడు. చిన్మోయ్ కృష్ణ దాస్‌తో పాటు ఛత్ర లీగ్, జుబా లీగ్‌లపై కూడా కేసు నమోదైంది.
రెచ్చగొట్టే ప్రసంగాలు, విధ్వంసకర ఘటనలను చార్జిషీట్‌లో ప్రస్తావించారు. చిన్మోయ్ కృష్ణ దాస్ బెయిల్ కేసు ఈరోజు మంగళవారం విచారణకు రానుంది. అయిత సరిగ్గా 24 గంటల ముందు చిన్మోయ్ దాస్ సహా పలువురిపై కొత్త కేసు నమోదు కావడంతో సనాతన వాసులు కదిలారు. చిన్మోయ్ కృష్ణ దాస్‌కు బెయిల్‌పై ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వాలని అనుకోవడం లేదని.. జైలు నుంచి ఆయని బయటకు విడుదల చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. అందుకనే పరిపాలన అధికారులు పలు కారణాలు చూపిస్తున్నారని ఆ దేశంలోని హిందువులు భావిస్తున్నారు.
చిన్మోయ్ కృష్ణ దాస్ జాతీయ జెండాను అపవిత్రం చేయడంతో సహా పలు ఆరోపణలపై అరెస్టయ్యారు. చిట్టగాంగ్ పోలీసులు రాజధాని ఢాకా సమీపంలో గత వారం అరెస్టు చేశారు. బెయిల్ తిరస్కరణకు గురి కావడమే కాదు బంగ్లాదేశ్ కోర్టు జైలు కస్టడీని ఆదేశించింది. దీంతో బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులు నిరసనలకు దిగారు. ప్రపంచవ్యాప్తంగా చిన్మోయ్ కృష్ణ దాస్ విడుదల చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందువల్ల అంతర్జాతీయ సమాజం కూడా మంగళవారం రోజున జరగనున్న విచారణపై దృష్టి సారించింది. ఆ దేశంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తోంది.
బంగ్లాదేశ్‌లోని హిందూ వర్గ సంప్రదాయవాదులు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయరని భయపడుతున్నారు. అందుకనే బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది. కాగా బెయిల్ కేసుకు ముందు చిన్మోయ్ కృష్ణ దాస్ న్యాయవాదిపై దాడి జరిగిందని ఇస్కాన్ పేర్కొంది. లాయర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..