ఫేస్ మాస్క్ పై స్కూల్లో గొడవ.. టీచర్ పై విద్యార్థిని తండ్రి దాడి.. కొత్త నిబంధనలతో చిక్కులు

| Edited By: Phani CH

Aug 14, 2021 | 10:06 AM

స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థల్లో కూడా మాస్కుల ధారణను తప్పనిసరి చేస్తూ అమెరికా ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు కొన్ని చోట్ల చిక్కులకు కారణమవుతున్నాయి.

ఫేస్ మాస్క్ పై స్కూల్లో గొడవ.. టీచర్ పై విద్యార్థిని తండ్రి దాడి.. కొత్త నిబంధనలతో చిక్కులు
Attack On Teacher By Parent In California School
Follow us on

స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థల్లో కూడా మాస్కుల ధారణను తప్పనిసరి చేస్తూ అమెరికా ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు కొన్ని చోట్ల చిక్కులకు కారణమవుతున్నాయి. ప్రజలే కాకుండా విద్యార్థులు, టీచర్లు సైతం వీటిని ధరించాలని బైడెన్ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికన్లలో చాలామంది వీటిని వ్యతిరేకిస్తున్నారు. నార్తర్న్ కాలిఫోర్నియాలోని ఓ స్కూల్లో ఈ గైడ్ లైన్స్.. ఒక విద్యార్థిని తండ్రికి, ఓ టీచర్ కి మధ్య గొడవ జరగడానికి దారి తీసింది. ఆ పేరెంట్ జరిపిన దాడిలో ఆ టీచర్ గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తెను తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆమె తండ్రి గంట ఆలస్యంగా వచ్చాడని..అప్పటికే టీచర్స్ లాంజ్ లో పలువురు మాస్కులతో కనబడడంతో ఆయన అసహనం వ్యక్తం చేశాడని తెల్సింది. ఫేస్ మాస్క్ విషయమై ఆ వ్యక్తికి, ఓ టీచర్ కి మధ్య వాగ్యుద్ధం జరిగిందని.. మాస్కులకు సంబంధించిన రూల్స్ అంతా కుట్ర అని, విద్యార్థులను జంతువుల్లా చూస్తున్నారంటూ ఆ వ్యక్తి మండిపడ్డాడని తెలిసింది. ఇందుకు ఆ టీచర్ అభ్యంతరం చెప్పగా ఆయన ఆగ్రహంతో అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడని తెలుస్తోంది.

ఈ ఘటనపై స్కూలు ప్రిన్సిపల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఆ విద్యార్థిని తండ్రి మీద పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా మాస్కుల విషయంలో నిబంధనలు తాము తీసుకున్న నిర్ణయం కాదని, దేశంలో కోవిడ్ కేసులు పెరగడంతో ప్రభుత్వమే వీటిని తప్పనిసరి చేసిందని ఆమె అన్నారు. అన్ని విద్యా సంస్థలు వీటిని పాటిస్తున్నాయన్నారు. ఆ వ్యక్తిని స్కూల్లోకి అనుమతించడం లేదని, ఆయన స్కూలు బయటే ఉండి తన కూతురిని పికప్ చేసుకోవాలని యాజమాన్యం నిర్ణయించిందని ఆమె చెప్పారు. ఈ విధమైన ఘటనలు జరగకుండా ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికాలో రోజుకు సగటున లక్ష డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి మాస్కుల నిబంధనను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Fake Voter IDs: ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను హ్యాక్.. 10 వేలకు పైగా నకిలీ ఓటర్ ఐడి కార్డులు.. నలుగురు యువకులు అరెస్టు..

మాస్కులు తప్పనిసరి ! చైనాలో ప్రజలకు నూతన మార్గదర్శక సూత్రాలు జారీ