Asteroid: ఈవారంలోనే భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కంటే పెద్దది.. వాటికి ముప్పు తప్పదా..

|

Sep 16, 2022 | 12:25 PM

దేశంలో అతి పెద్ద విగ్రహం ఏదైనా ఉందా అంటే వెంటనే గుర్తొచ్చేది గుజరాత్ లోని సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇప్పటివరకు ఇంతకంటే పెద్ద విగ్రహం దేశంలో..

Asteroid: ఈవారంలోనే భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కంటే పెద్దది.. వాటికి ముప్పు తప్పదా..
Asteroid (file Photo)
Follow us on

Asteroid: దేశంలో అతి పెద్ద విగ్రహం ఏదైనా ఉందా అంటే వెంటనే గుర్తొచ్చేది గుజరాత్ లోని సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇప్పటివరకు ఇంతకంటే పెద్ద విగ్రహం దేశంలో లేదు. దీని ఎత్తు 597 అడుగులు.. అంటే 182 మీటర్లు. అయితే ఈవిగ్రహం కంటే పెద్దదైన భారీ గ్రహాశకలం ఒకటి ఈవారంలో భూమి దగ్గరగా వస్తోందట. గుజరాత్ లోని ఐక్యతామూర్తి విగ్రహం పొడవు 182 మీటర్లయితే, 2005 ఆర్‌ఎక్స్‌3గా నామకరణం చేసిన ఈ గ్రహశకలం పొడవు 210 మీటర్లు. ఈ నెల 18వ తేదీన గంటకు 62,820 కిలోమీటర్ల వేగంతో భూమికి 47,42,252 కిలోమీటర్ల దూరం నుంచి అది దూసుకుపోనుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 460 కోట్ల సంవత్సరాల క్రితం సౌర మండలం ఏర్పడినప్పుడు మిగిలిన శిథిలాలే గ్రహ శకలాలు. భూమి సూర్యుడికి 9.3 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఒక ఏయూ అంటారు. ఒక ఏయూ కన్నా 1.3 రెట్లు తక్కువ దూరంలోని ఖగోళ వస్తువులను పృథ్వీ సమీప వస్తువులు (NEO) అంటారు. ఆర్‌ ఎక్స్‌ 3 గ్రహ శకలం 2005లో భూమికి దగ్గరగా వచ్చింది. అప్పటి నుంచి అమెరికా నాసా అనుబంధ సంస్థ అయిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబరేటరీ (JPL) ఈ శకలంపై నిఘా ఉంచింది. సూర్యుడి చుట్టూ ప్రత్యేక కక్ష్యలో తిరిగే ఈ గ్రహ శకలం మళ్లీ 2036 మార్చిలో భూమికి చేరువగా వస్తుంది.

ఈ వారం 2005 ఆర్‌ఎక్స్‌3తో పాటు మరో నాలుగు గ్రహశకలాలు భూమికి దగ్గర నుంచి పయనిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కోట్ల సంవత్సరాల క్రితం ఒక గ్రహశకలం భూమిపై పడటంతో సరీసృపాలు అంతరించిపోయాయి. మళ్లీ అలాంటి దుర్ఘటన జరిగితే భూమి మీద జీవజాలానికి ముప్పు తప్పదు. అందువల్ల భూమికి దగ్గరగా వచ్చే గ్రహ శకలాలను దూరంగా నెట్టివేసే సాంకేతికతను అభివృద్ధి చేసిన నాసా దాన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించడానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈభారీ గ్రహశకలం భూమికి చేరువుగా వస్తే మాత్రం కొంత ప్రమాదమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..