కరోనా వైరస్ విజృంభణతో చైనా(China) కకావికలమవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులతో అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటున్నారు. దేశంలోని ముఖ్య నగరం, వాణిజ్య రాజధాని అయిన షాంఘై(Shanghai) లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే ఉండటం ఆందోళన కలిగించే అంశం. భారీగా కరోనా కేసులు వెలుగుచూస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పరీక్షలను పెంచడంతో పాటు, భారీగా ఆరోగ్య కార్యకర్తలు, సైన్యాన్ని(Army) నగరానికి పంపించింది. చైనాలో ఇవాళ కొత్తగా 13 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. ఇందులో దాదాపు 9వేల కేసులు ఒక్క షాంఘైలోనే ఉండటం గమనార్హం. ఫలితంగా అధికారులు గతవారం నగరంలో లాక్‌డౌన్ విధించారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసినప్పటికీ షాంఘైలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు సోమవారం నుంచి ట్విన్ కొవిడ్ పరీక్షలు మొదలుపెట్టారు. దీని ప్రకారం నగరంలోని ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం డ్రాగన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఆర్మీ, నేవీ నుంచి దాదాపు 2వేల మందికి పైగా సిబ్బందిని నగరానికి పంపింది. దీంతో పాటు దాదాపు 15 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందిని షాంఘైకి తరలించింది.
మరోవైపు.. వైరస్ సంక్రమణ గొలుసును తెగ్గొట్టడంతో పాటు, వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా షాంఘైలో కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. క్లోజ్డ్ లూప్ వ్యూహంతో కొన్ని అత్యవసర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. దీంతో ఆయా కంపెనీల సిబ్బంది బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆఫీసుల్లోనే నిర్బంధంలో పనిచేస్తున్నారు.
Also Read
Viral Video: మగజాతి ఆణిముత్యాలు వీరే.. కొత్త జంటతో ఏం చేశారో చూస్తే బాక్సులు బద్దలైనట్లే!