Tainted cocaine kills 20 in Argentina: అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కాదేది కల్తీకి అనర్హం అన్నారు పెద్దలు. దాన్ని నిజం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఆఖరికి కొకైన్‌ను కూడా కల్తీ చేసి.. బానిసల ప్రాణాలు తీస్తున్నారు. కొకైన్ వంటి మాదకద్రవ్యాలను చాలా దేశాలు బ్యాన్ చేశాయి. కానీ, మత్తు కోసం యువత పెడదారులు తొక్కి, వాటికి బానిసలుగా మారుతున్నారు. మత్తుకు బానిసలైన వారి వీక్ పాయింట్‌ను క్యాష్ చేసుకుంటున్నారు అక్రమార్కులు. తాజాగా కల్తీ కొకైన్ తీసుకోవడం వల్ల అర్జెంటీనా (Argentina) రాజధాని బ్యూనస్ ఎయిర్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 మంది చనిపోయారు. మరో 74 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. చట్టవిరుద్ధమైన ఈ మాదక ద్రవ్యాన్ని (Drugs) విషం, ఇతర పదార్థాలతో కల్తీ చేసుంటారని భావిస్తున్నారు దర్యాప్తు అధికారులు. డ్రగ్స్ తీసుకునేవారు ఎవరైనా గత 24 గంటల్లో కొకైన్ కొనుగోలు చేసుంటే, దానిని పారేయాలని బ్యూనస్‌ఎయిర్స్ రక్షణ మంత్రి ప్రజలకు సూచించారు.
బాధితుల్లో రాజధాని ప్రాంతానికి చెందిన హర్లింఘామ్, ట్రెస్ డీ ఫెబ్రేరో, శాన్ మార్టిన్ జిల్లాలకు చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కల్తీ కొకైన్ ఇష్యూపై హర్లింఘామ్‌లో ఆందోళనలు జరిగాయి. ఓ పోలీసు వాహనంపై దాడి చేశారు బాధితుల బంధువులు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి 2019లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం, కొకైన్ వినియోగించే దేశాల్లో అమెరికా, ఉరుగ్వే తర్వాత అర్జెంటీనా మూడో స్థానంలో నిలిచింది. అయితే, మత్తు పధార్థాల కట్టడికి అర్జెంటీనా ఎన్ని చర్యలు చేపట్టినా సరైన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో అక్కడ విచ్చలవిడిగా కొకైన్ వంటి మాదకద్రవ్యాలు అమ్ముతున్నారు.
డిమాండ్ ఎక్కువగా ఉన్న టైంలో, ఇలా ఇతర పధార్థాలు మిక్స్ చేసి విక్రయిస్తారని అర్జెంటీనా పోలీసులు చెబుతున్నారు. అలాంటివి తీసుకోవడంతో చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా మాదకద్రవ్యాల వినియోగాన్ని మానాలని అర్జెంటీనా పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: