Lock Down In India: భారత్‌లో రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆక్సిజన్, బెడ్స్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా 3,66,161 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక 3,754 మరణాలతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. దేశంలో వైద్య వ్వవస్థ పూర్తిగా అస్తవ్యస్థమవుతోన్న నేపథ్యంలో.. పెరిగిపోతున్న కేసులు తగ్గించడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ఇప్పటికే ఎంతో మంది నిపుణులు సూచిస్తున్నారు.
దేశం లోపల, వెలుపల నుంచి పలువురు నిపుణులు భారత్‌లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని తేల్చి చెబుతున్నారు. దీంతో భారత ప్రభుత్వంపై రోజురోజుకీ ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూల పేరుతో నిబంధనలు పెడుతోన్న ఇవేవీ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేవని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పరిస్థితులను అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు ఈ దిశలో అడుగులు వేస్తున్నప్పటికీ వైరస్ చైన్‌ను బ్రేక్ చేయాలంటే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. లాక్‌డౌన్ అంటే ఆరు నెలలపాటు అన్నీ మూసివేయడం కాదని.. కనీసం రెండు నుంచి మూడు వారాలపాటు నిబంధనలు విధించాలని పేర్కొన్నారు. దీనివల్ల వైరస్ చైన్‌కు అడ్డుకట్ట పడుతుందని ఆయన తెలిపారు. మూడు వారాల తర్వాత కేసులు వాటంతట అవే తగ్గుముఖం పడతాయని తెలిపిన ఫౌసీ… వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దేశంలో లాక్‌డౌన్ విధించమని ప్రధానికి లేఖ రాసిన విషయం విధితమే మరి.. భారత ప్రభుత్వం ఈ విషయమై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: Chennai Railway Police: చెన్నై రైల్వేస్టేషన్ లో పోలీసుల ఎంజాయ్ ఎంజామీ.. ఎందుకో తెలుసా.. Viral Video
Virat Kohli: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ..