Corona Pandemic: కరోనా మహమ్మారి భారతదేశాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. ఇటువంటి విషమ పరిస్థితుల్లో అన్నిరకాలుగానూ సహాయం చేయడానికి అమెరికా ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే తమ సహకారంపై ప్రకటన చేశారు. సోమవారం ఉదయం కూడా ఆయన భారతదేశానికి తాము ఇచ్చే సహాయంపై ఒక ట్వీట్ చేశారు. దానిలో ”మహమ్మారి ప్రారంభంలో మన ఆస్పత్రులు దెబ్బతిన్నందున భారతదేశం అమెరికాకు సహాయం పంపినట్లే, భారతదేశానికి అవసరమైన సమయంలో సహాయం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము.” అని వివరించారు.
ఇక సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ లో మాట్లాడారు. వారిద్దరి మధ్య ఇటీవల కరోనా కారణంగా భారత్ లోని పరిస్థితులపై పలు అంశాల్లో సంభాషణ నడిచింది. వీరిద్దరి మధ్య ఇండియాకు అమెరికా చేయబోయే సహాయంపై మరోమారు అమెరికా అధ్యక్షుడు హామీ ఇచ్చారు. కష్ట సమయంలో భారతదేశం కోసం అమెరికా నుంచి సహాయం కచ్చితంగా అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా.. ఆయన ప్రధాని మోడీతో మాట్లాడుతూ COVID-19 కు వ్యతిరేకంగా పోరాటంలో అమెరికా, భారతదేశం కలిసి పనిచేస్తాయని ఇంతకు ముందు చెప్పిన విషయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇటీవల COVID-19 కేసుల పెరుగుదల వలన ప్రభావితమైన భారత ప్రజలకు అమెరికా స్థిరమైన మద్దతును బైడెన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అమెరికా ఆక్సిజన్ సంబంధిత సామాగ్రి, టీకా ముడి పదార్థాలు, చికిత్సా విధానాలతో సహా అత్యవసర సహాయాన్ని అందిస్తోందని ఆయన తెలిపారు.
ఇరు దేశాల మధ్య బలమైన సహకారం పట్ల ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. మన పౌరులను, మన సమాజాల ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో అమెరికా, భారతదేశం భుజం భుజం కలిపి నిలబడాలని ఇరువురు నాయకులు తీర్మానించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు భారతావనికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చాయి. ఆస్ట్రేలియా నుంచి పెద్ద మొత్తంలో ఆక్సిజన్ భారత్ కు ఓడ ద్వారా పంపిస్తున్నారు. అదేవిధంగా ఇతర దేశాలు కూడా కరోనాపై భారత్ పోరాటానికి తమ మద్దతు ప్రకటించాయి.
భారత్ కు సహాయం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ట్వీట్..
Just as India sent assistance to the United States as our hospitals were strained early in the pandemic, we are determined to help India in its time of need. https://t.co/SzWRj0eP3y
— President Biden (@POTUS) April 25, 2021
Also Read: Social Distance: కరోనా కాలం..సామాజిక దూరం తప్పదు మరి..ఓ వరుడి సైకిల్ పై బారాత్..ప్రజలను ఆకట్టుకుంది!
Eye Care: కంట్లో చుక్కల మందు అనుకుని..జిగురు చుక్కలు వేసేసుకుంది..తరువాత ఏం జరిగిందంటే..