Afghanistan Tourists: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల రాజ్యంలో అరాచకాలు పెచ్చుమీరుతున్న విషయం తెలిసిందే. ఆటవిక శిక్షలతో తాలిబన్లు నరరూప కాలకేయులు లాగా ప్రవర్తిస్తున్నారు. మహిళలపై ఆంక్షలతో ప్రారంభమైన తాలిబన్ల పాలన.. బహిరంగ ఉరిశిక్షలు, నరికివేతలు పలు విషయాలపై నియంత్రణ లాంటి చట్టాల వరకూ వెళ్లింది. కఠిన షరియా చట్టాల అమలు చేస్తున్న తాలిబన్ల పాలనలో ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. కొన్ని ఘటనలు ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కొంచెం ఉపశమనం కలిగించే ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆఫ్ఘన్‌లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితులు చక్కబడుతున్నాయనడానికి ఒక ఫొటో ఉదహరణగా నిలిచింది. ఆఫ్ఘన్‌కు చెందిన కొన్ని కుటుంబాలు స్నేహితులతో కలిసి సేదదీరటానికి పర్యాటక ప్రాంతాలను చుట్టొస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఫొటో ఆఫ్ఘనిస్తాన్ బమియాన్ ప్రావిన్స్‌లోని బంద్- ఎ- అమీర్ సరస్సు. తాలిబన్లు పాలనాపగ్గాలు చేపట్టిన మొదట్లో ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ కొందరు బోటింగ్ చేస్తుండగా.. మరికొందరు స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని.. సంతోషంగా బోటింగ్ చేసినట్లు పర్యాటకులు వెల్లడించారు.
హిందూకుష్ పర్వతాల మధ్యలో అందమైన ఆరు సరస్సులు ఉంటాయి. వాటి సమూహమే ఈ బంద్- ఎ- అమీర్. దీనికి అఫ్గానిస్తాన్ గ్రాండ్ కెన్యాన్‌గా కూడా పేరుంది. ఈ చెరువు నీరు నీలం రంగులో కనిపిస్తాయి. నీటిలో కలిసిన భారీ ఖనిజాలే ఇందుకు కారణమని ఇక్కడి వారు అంటుంటారు. అయితే.. ఆఫ్ఘాన్‌ను స్వాధీనం చేసుకున్న కొన్ని రోజుల్లోనే తాలిబన్లు ఈ సరస్సుల్లో తుపాకులను ఎక్కుపెట్టి ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అప్పట్లో ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
Also Read: