Afghanistan :ఆప్ఘనిస్తాన్ లో మానవతా సంక్షభం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అక్కడి పరిస్ధితులను గమనించిన యునైటెడ్స్ నేషన్స్ ఈవ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాలిబన్ల పాలనలో ఆప్ఘనిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేక.. రోగాలతో మృత్యువు బారిన పడుతున్నారు. దేశంలో స్వచ్ఛమైన తాగునీరు, సాధారణ మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో మురికి వ్యాప్తి చెందటంతో ప్రజలంతా కలరా బారినపడుతున్నారు. దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక ఆసుపత్రిల్లో వార్డులన్ని రోగులతో నిండిపోయాయని.. తాలిబాన్ల పాలన మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆదేశం ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కొన్ని ఆసుపత్రుల్లో రోగులను కూడా చేర్చుకోలేని దుస్థితి నెలకొంది. హెల్మండ్ ప్రావిన్స్‌లోని ముసా కాలా జిల్లా ఆసుపత్రిలో కలరా రోగులకు మినహా ఇతర రోగులను చేర్చుకోవడం లేదు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులన్ని కలరా రోగులతో నిండిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాడిన సూదులే వాడుతున్నారు. రోగులు పడుకునే బల్లలు తుప్పుపట్టుకుపోయాయి. ఈ కారణాలతోనే ఐక్యరాజ్యసమితి ఆప్ఘనిస్తాన్ లో మానవతా సంక్షోభాన్ని ప్రపంచంలోనే అత్యంత దారుణమైనది పేర్కొంది. దక్షిణ ఆప్ఘనిస్తాన్ లో పేదరికంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత ద్రవ్యోల్బణం పెరిగి కరువుతో అల్లాడిపోతున్నారు.
తాలిబన్ల పాలనలో తాము నలిగిపోతున్నామని పోషకాహార లోపంతో బాధపడుతున్న తన ఆరు నెలల మనవడికి వైద్యం కోసం లష్కర్ గా వచ్చిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తమ దేశం తాలిబన్ల వశమైనప్పటినుంచి కనీసం వంట నూనె కూడా దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపింది.పోషకాహార లోపంతో ఎంతో మంది చిన్నారులు బాధపడుతున్నారని.. వారంతా ఆసుపత్రుల్లోని చిన్న వార్డులో ఒక్కో బెడ్ పై ఇద్దరు చికిత్స పొందుతున్నారంటూ అక్కడి భయానక పరిస్ధితులను వెల్లడించింది. తమకు తినడానికి రొట్టే కూడా దొరకడం లేదంటూ మరో చిన్నారి తల్లి వాపోయింది. ఛార్జీలకు డబ్బులు లేక కనీసం తమ పిల్లలను చాలామంది ఆసుపత్రులకు తీసుకురాలేకపోతున్నారని.. ఎంతో మంది ఇళ్ల వద్ద ప్రాణాలు కోల్పోతున్నారని ఆప్ఘనిస్తాన్ వైద్యులే ప్రకటించడం అక్కడి భయానక పరిస్థితులను తెలియజేస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించని జీతాలు: ఆప్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి 2015 నాటికి దారుణంగా ఉన్నప్పటికి.. అమెరికా తన దళాలను ఉపసంహరించుకున్న తర్వాత కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆతర్వాత అక్కడ బ్యాంకింగ్ రంగం కుప్పకూలింది. దీంతో విదేశీ సాయం నిలిచిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తన జిడిపిలో 45 శాతం విదేశీ సాయంగా పొందేది. ఆప్ఘనిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులను చూసి ఇతర దేశాలు సాయం అందిచడానికి ఆసక్తి చూపించడం లేదు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఉపాధ్యాయులు, వైద్యులు సహా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారికి నెలల తరబడి జీతాలు అందడం లేదు. ఇలా తాలిబన్ల పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఐక్యరాజ్యసమితి.. మానవతా సంక్షభానికి ఆప్ఘానిస్తాన్ సజీవ సాక్ష్యమని వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..