Watch Video: ధరాఘాతంతో పాకిస్తాన్ ప్రజలు విలవిల.. ఎలా బతకాలంటూ కంటతడిపెట్టుకున్న గృహిణి
ధరలు నియంత్రించడంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పీఎంఎల్-ఎన్ నేత మర్యం నవాజ్ విఫలం చెందారని కరాచీకి చెందిన రబియా అనే ఆ మహిళ ధ్వజమెత్తారు.
Pakistan News: పాకిస్తాన్‌లో నిత్యవసర సరకుల ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్, చెక్కర, పాలు, వంట నూనె, గోధుమ పిండి, గుడ్డు, చికెన్ తదితర నిత్యవసర సరకులు మునుపెన్నడూ లేని స్థాయికి చేరాయి. బంగాళాదుంపలు, చికెన్ ధరలు, గ్యాస్ సిలిండర్, విద్యుత్ ఛార్జీలు, మెడిసిన్స్, పప్పు ధాన్యాల ధరలు కూడా భారీగా పెరిగాయి. ద్రవ్యోల్భణం దెబ్బకు సామాన్యులకు పూట గడవడమే కష్టంగా మారుతోంది. పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితికి ఓ వీడియో అద్దంపడుతోంది. ధరలు భారీగా పెరగడంతో ఇళ్లు గడవడం కష్టంగా మారిందంటూ ఓ సామన్య మహిళ వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఆమె ఒక్కరే కాదు.. పాకిస్థాన్‌లో చాలా కుటుంబాలు ఇదేరకమైన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. శ్రీలంక తరహాలోనే పాకిస్థాన్‌లో కూడా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తమ కుటుంబ ఆర్థిక కష్టాలను ఏకరువు పెట్టిన ఆ మహిళ.. ఇక ఎలా బతకాలో అర్థంకావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ధరలు నియంత్రించడంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పీఎంఎల్-ఎన్ నేత మర్యం నవాజ్ విఫలం చెందారని కరాచీకి చెందిన రబియా అనే ఆ మహిళ ధ్వజమెత్తారు. ధరలు పెరిగిపోవడంతో తిండి పెట్టకుండా పిల్లలను చంపేసుకోవాలంటూ ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. నిత్యవసర సరకుల ధరలు భారీగా పెరగడంతో ఇక తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో పాలకులే చెప్పాలంటూ ఆ వీడియోలో రబియా నిలదీశారు. తన పిల్లలకు మూర్చ వ్యాధి ఉందని తెలిపిన ఆ మహిళ.. ధరలు భారీగా పెరగడంతో మందులు కొనలేక ఇబ్బందిపడుతున్నట్లు వాపోయారు.
کراچی سے تعلق رکھنے والی ایک ماں نے حکمرانوں کو اپنا بجلی کا بل اور کچن کے لئے اشیاء کی خریداری کا بل دکھا کر کچھ سوال پوچھے میں نے یہ سوال مفتاح اسماعیل کو بھیج دئیے مفتاح صاحب نے جواب بھجوا دیا ہے لیکن پہلے ایک ماں کا دکھڑا سن لیں pic.twitter.com/THahmjAjUL
— Hamid Mir (@HamidMirPAK) August 9, 2022
ఈ వీడియోపై స్పందించిన పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్.. దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని చెప్పుకొచ్చారు. జూన్ మాసం నుంచి ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, మెడిసిన్స్‌పై అదనపు పన్నులు వేయలేదని వివరణ ఇచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి