Afghanistan-Taliban: “తాలిబన్లను చూసి భయపడవద్దు”.. టీవీ యాంకర్ వెనుక నుంచి తుపాకులతో ముష్కరులు.. వైరల్‌‌గా మారిన వీడియో

|

Aug 30, 2021 | 1:19 PM

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్‌పై నిషేధం ప్రకటించిన తాలిబన్లు.. ప్రసార సాధానాలపై సైతం ఆంక్షలు విధిస్తున్నారు.

Afghanistan-Taliban: “తాలిబన్లను చూసి భయపడవద్దు”.. టీవీ యాంకర్ వెనుక నుంచి తుపాకులతో ముష్కరులు.. వైరల్‌‌గా మారిన వీడియో
Tv Anchor Forced To Praise Taliban With Armed Men Behind
Follow us on

Afghanistan-Taliban Crisis: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్‌పై నిషేధం ప్రకటించిన తాలిబన్లు.. ప్రసార సాధానాలపై సైతం ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా ఓ జర్నలిస్ట్‌‌కు సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘తాలిబన్ల ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ప్రభుత్వాన్ని చూసి అఫ్ఘానిస్థాన్‌ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు’’ అఫ్ఘాన్‌లోని ఓ టీవీ యాంకర్‌ చెప్పిన మాటలివి. కానీ, అవి చెబుతున్నంతసేపు ఆయన భయంతో వణికిపోయారు. ఎందుకంటే, అవి ఆయన సొంతంగా చెప్పిన మాటలు కావు.. తాలిబన్లు వెనుక నుంచి తుపాకీ గురీ పెట్టి మరీ చెప్పించిన మాటలు. ఓ టీవీ స్టూడియోలోకి చొరబడిన ముష్కరులు అక్కడి యాంకర్‌ను బెదిరించి తాలిబన్లకు అనుకూలంగా ప్రకటన ఇప్పించుకున్నారు.

యాంకర్ వెనుక ముష్కరులు తుపాకులతో నిల్చున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని ఇరాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘‘తాలిబన్ల అరాచకాలకు మరో రుజువు’’ అంటూ పేర్కొన్నారు. రాక్షస జాతికి చెందిన ముష్కరులు.. తాము మారిపోయామని, తమని చూసి భయపడొద్దంటూ శాంతివచనాలు వల్లిస్తోన్న తాలిబన్లు.. చేతల్లో మాత్రం తమ సహజసిద్ధ అరాచకాన్నే చూపిస్తున్నారు. మొదట్లో కొద్ది రోజులు ఎలాంటి దాడులకు పాల్పడని ముష్కరులు, దేశాన్ని పూర్తిగా ఆక్రమించిన తర్వాత తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెతికి పట్టుకుని మరీ హతమారుస్తున్నారు. తాజాగా జానపద గాయకుడు ఫవద్ అందరబీని హతమార్చారు. స్థానికంగా వినిపిస్తున్న కథనం ప్రకారం… గాయకుడు ఫవద్ అందరబీని తాలిబన్లు ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. అనంతరం గన్‌తో అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అందరబీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


పత్రికా స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదన్న తాలిబన్లు.. ఇటీవల అనేక మంది జర్నలిస్టులపై దాడులు చేసిన ఘటనలు వెలుగులోకి రావడం గమనార్హం. కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత పలువురు జర్నలిస్టుల ఇళ్లలోకి ముష్కరులు చొరబడి వారి బంధువులపై దాడి చేశారు. ఓ విలేకరి కుటుంబ సభ్యుడిని కాల్చి చంపారు. దీంతో భయపడిన పలువురు జర్నలిస్టులు దేశం విడిచి పారిపోతున్నారు. ఇప్పటికే వందలాది మంది విలేకర్లు విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు కోరుతున్నారు. తాజాగా అఫ్ఘాన్ జానపద కళాకారుడిని అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఇలా తాలిబన్ల దాష్టీకానికి మరెందరు బలి కావల్సి వస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.
Read Also… Krishna Water Dispute: రెండు రాష్ట్రాల మధ్య జటిలమవుతున్న జల జగడం.. మరోసారి కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ..