Taliban Afghanistan Panjshir: “పంజ్‌షేర్ మా వశమైపోయింది.. ఆఫ్ఘన్ మొత్తం మాదే” అని ప్రకటించుకున్నారు తాలిబన్లు. దీంతో ఆఫ్ఘన్‌లో ముల్లా బరాదర్ నేతృత్వలో తాలిబన్ల ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ఏర్పాటయ్యే అవకాశముంది. కాగా, పంజ్‌షేర్ లోయలో మాత్రం నార్తర్న్ అలయెన్స్ చేతిలో తాలిబన్లు అనేక మార్లు చావుదెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. ఒకదశలో పంజ్‌షేర్ వ్యాలీలో తాలిబన్లకు, నార్తర్న్ అలయెన్స్‌కు మధ్య భీకర పోరు జరిగింది. తమ దాడుల్లో 450 మంది తాలిబన్లు హతమైనట్టు రెసిస్టెంట్ ఫోర్స్ ప్రకటించింది.
పంజ్‌షేర్ లోయ లోకి ప్రవేశిస్తున్న తాలిబన్ల ట్యాంకులను నార్తర్న్ అలయెన్స్ బలగాలు పేల్చేస్తున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. పంజ్‌షేర్‌పై పట్టు సాధిస్తునట్టు తాలిబన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాళ్లు ఒక్క అంగుంళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేదని నార్తర్న్ అలయెన్స్ అంటోంది. కాగా, పంజ్‌షేర్ ప్రాంతంలో ఉన్న మరో 130 మంది తాలిబన్లను నిన్న నార్తర్న్ అలయెన్స్ బలగాలు చుట్టుముట్టాయి. అప్పటివరకు కూడా పంజ్‌షేర్ వ్యాలీ తాలిబన్లకు స్వాధీనం కాలేదు.
ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తమ గుప్పిట్లో ఉన్నప్పటికి .. పంజ్‌షేర్ లోయ ఇంకా తమ ఆధీనం లోకి రాకపోవడాన్ని తాలిబన్లు జీర్ణించుకోలేకపోయారు. నార్తర్న్ అలయెన్స్‌తో చర్చలు విఫలం కావడంతో పంజ్‌షేర్ వ్యాలీకి భారీగా తాలిబన్ బలగాలు చేరుకున్నాయి. తాలిబన్లకు అల్‌ఖైదాతో పాటు పాక్ ఐఎస్‌ఐ కూడా సాయం చేస్తోంది. పంజ్‌షేర్ వ్యాలీలో జరుగుతున్న పోరులో అల్‌ఖైదా టెర్రరిస్టులు తాలిబన్ల తరపున పోరాడుతున్నారు.