AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9/11 విషాదం.. ఆ రోజున షిఫ్ట్ మారడం సిబి ప్రాణాలను కాపాడింది

2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ లోని జంట టవర్లపై అల్ ఖైదా దాడి జరిగి అవి కుప్పకూలిన సమయంలో, సెకూ సిబి 107వ అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో పనిచేయాల్సి ఉంది. ఆ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్ స్టేషన్‌ను పర్యవేక్షించాల్సిన బాధ్యత అతనిది. అయితే, షిఫ్ట్ మారడంతో 36 ఏళ్ల సిబి తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే తాను అపరాధభావనలో కుంగిపోయి నరకం అనుభవించినట్లు సీఎన్ ఎన్ ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో తాజాగా తెలిపాడు.

9/11 విషాదం.. ఆ రోజున షిఫ్ట్ మారడం సిబి ప్రాణాలను కాపాడింది
911 Attack Survivor
Sharada V
|

Updated on: Sep 08, 2026 | 3:35 PM

Share

అంతకు ముందు రెస్టారెంట్‌లో పనిచేసే సహోద్యోగి రివాస్ తో మాట్లాడి సిబి తన షిఫ్ట్‌ను మార్చుకున్నాడు. రివాస్‌కు ఆదివారం సెలవు కావాల్సి ఉండటంతో, సిబి అతనికి బదులుగా పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. సీఎన్ఎన్  కథనం ప్రకారం 9/11 ఉదయం  సిబి షిఫ్ట్‌లో రివాస్ విధులకు హాజరయ్యాడు.

ప్రాణాలు కోల్పోయిన సహోద్యోగులు

ఆ రోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో అల్ ఖైదా జరిపిన దాడిలో 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో సిబి షిఫ్ట్‌లో పనిచేసిన  రివాస్ కూడా ఉన్నాడు. ‘విండోస్ ఆన్ ది వరల్డ్’ రెస్టారెంట్‌కు చెందిన 79 మంది సహోద్యోగులను సిబి ఆ రోజు కోల్పోయాడు. “మార్నింగ్ షిఫ్ట్ లో సిబ్బందిని.. ప్రతిరోజూ కలిసి మెలిసి తిరిగే వారందరినీ ఒకేసారి కోల్పోయాను. ఆ బాధ నన్ను తీవ్రంగా వెంటాడింది” అని 25 ఏళ్లుగా ఆ బాధను మోస్తున్న సిబి  ఆవేదన వ్యక్తం చేశాడు.

తమ వారు బతికే ఉన్నారని నమ్మిన సిబి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ, సమాచారం కోసం ఆశగా ఎదురుచూశాడు.  రెస్టారెంట్‌ కార్మికులలో చాలా మంది సరైన పత్రాలు లేని వలసదారులు కావడంతో, సహాయం కోసం అధికారులను ఆశ్రయించడానికి అప్పట్లో వారి కుటుంబ సభ్యులు  భయపడ్డారని సిబి తాజాగా తెలిపాడు. దుర్ఘటన జరిగే నాటికి సిబి వయసు 36 సంవత్సరాలు. ఆ విషాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  తన సహోద్యోగి, తోటి సిబ్బంది అంతా ప్రాణాలు కోల్పోవడంతో సిబి తీవ్రమైన మానసిక వేదనను, అపరాధ భావనను ఎదుర్కొన్నాడు.  “వారందరూ చనిపోయారు. నేను ఆ జ్ఞాపకాలతోనే బతకాల్సి వస్తోంది… వాళ్లే ఎందుకు?” అంటూ సిబి  ఎంతో భావోద్వేగంతో తెలిపాడు.

9/11 దాడుల తర్వాత సిబి ఎప్పుడూ రెస్టారెంట్ రంగంలోకి తిరిగి వెళ్లలేదు.”కొన్ని రోజులు స్నేహం చేసి, ఆ తర్వాత వారిని కోల్పోవడంలో ఎలాంటి అర్ధం లేదు” అని  ఆవేదనగా చెప్పాడు.  “గుర్తుతెలియని వ్యక్తులని బండిలో ఎక్కించుకుని, గమ్యస్థానంలో దించుతాను, అంతే…  ఎవరూ స్నేహితులు కారు, మరుసటి రోజు వాళ్ళు చనిపోతారనే భయం ఉండదు” అంటూ ఆ విషాదం కారణంగా తన మనసులో గాయాన్ని బయటపెట్టాడు.

కుటుంబంలో కొత్త ఆనందం

 విషాదం వెంటాడిన కాలంలో, 2001 అక్టోబర్ 3వ తేదీన సిబి దంపతులకు పాప పుట్టింది. జీవితంలోని అత్యంత చీకటి రోజుల్లో ఆ చిన్నారి జననం తనకు కొంత ఆనందాన్ని ఇచ్చిందని సిబి అన్నాడు. “పాపను చూసుకోవడం వల్ల నా మనసును బిజీగా ఉంచుకోగలిగాను. భగవంతుడు నా ప్రాణాలను ఎందుకు కాపాడాడో దానికి ఒక అర్థం, కారణం దొరికింది” అని సిబి  తెలిపాడు.

సీఎన్ఎన్ డాక్యుమెంటరీలో సిబి

రెస్టారెంట్ లో ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల కథతో  రూపొందించిన ‘టాప్ ఆఫ్ ది వరల్డ్’  సీఎన్ఎన్ (CNN) డాక్యుమెంటరీలో సిబి సర్వైవర్ గా తన అనుభవాలను పంచుకున్నాడు. దాడుల 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని  డాక్యుమెంటరీ ఇటీవల సీఎన్ఎన్ (CNN) లో ప్రసారమైంది. రెస్టారెంట్ విజయానికి వెనుక వలస కార్మికుల కృషిని, 9/11 విషాదం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను లఘు చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

Follow Us