Boats Missing: సముద్రంలో 3 పడవలు మాయం.. 300 మందికి పైగా వలసదారుల ఆచూకీ గల్లంతు!

|

Jul 11, 2023 | 12:17 PM

ఆఫ్రికాలోని సెనెగల్‌ నుంచి స్పెయిన్‌లోని కానరీ దీవులకు బయల్దేరిన మూడు పడవలు సముద్రంలో కనబడకుండా పోయాయి. స్పెయిన్‌కు చెందిన ఈ మూడు పడవల్లో ప్రయాణిస్తున్న దాదాపు 300 మందికి పైగా వలసదారుల ఆచూకీ..

Boats Missing: సముద్రంలో 3 పడవలు మాయం.. 300 మందికి పైగా వలసదారుల ఆచూకీ గల్లంతు!
Boats Missing
Follow us on

స్పెయిన్: ఆఫ్రికాలోని సెనెగల్‌ నుంచి స్పెయిన్‌లోని కానరీ దీవులకు బయల్దేరిన మూడు పడవలు సముద్రంలో కనబడకుండా పోయాయి. స్పెయిన్‌కు చెందిన ఈ మూడు పడవల్లో ప్రయాణిస్తున్న దాదాపు 300 మందికి పైగా వలసదారుల ఆచూకీ గల్లంతయ్యింది. అట్లాంటిక్​ మహా సముద్రంలో 3 పడవలు అదృశ్యమయ్యాయని వలస సహాయక బృందం వాకింగ్ బోర్డర్స్ ఆదివారం వెల్లడించింది.

దీంతో స్పెయిన్‌ అధికారులు కానరీ దీవుల సమీపంలో అన్వేషణ మొదలుపెట్టారు. అదృశ్యమైన పడవల్లో 200 మందికిపైగా వలసదారులతో ఒక పడవ, 100 మందికిపైగా వలదారులతో మరో రెండు పడవలు దాదాపు 15 రోజుల క్రితం జూన్‌ 27న కానరీ దీవులకు బయల్దేరాయి. ఈ మూడు పడవలు సముద్రంలో అదృశ్యం అవ్వడంతో వలసదారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వలసదారుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. కానరీ దీవుల సమీపంలో ఇప్పటి వరకు రెస్క్యూ టీం 86 మందిని రక్షించారు. ఈ మార్గంలో కొన్నేళ్లుగా వలసదారుల తాకిడి తీవ్రంగా పెరిగింది. నిజానికి పశ్చిమ ఆఫ్రికా నుంచి కానరీ దీవుల ప్రయాణ మార్గం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏడు వేలమందికిపైగా  వలసదారులు దేశం దాటారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, హింస, రాజకీయ అస్థిరత, వాతావరణ మార్పుల వంటి అనేక కారణాలరిత్యా వలసదారులు ప్రాణాలను పణంగా పెట్టి దేశం దాటేందుకు సాహసిస్తున్నారు. ఆ సముద్రంలో వచ్చే భీకర అలల ధాటికి చిన్న పడవలు నిలవడం కష్టం. యూఎన్‌ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ డేటా ప్రకారం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 22 మంది చిన్నారులతో సహా 559 మంది గల్లంతయ్యారు. గతంలో ఈ మార్గంలో దాదాపు ఏడు శరణార్థుల పడవలు మునిగిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.