Halloween Stampede: దక్షిణ కొరియాలో తొక్కిసలాటకు కారణం ఇదేనా.. మృతుల్లో అధికులు వీరే..

|

Oct 30, 2022 | 11:04 AM

ఇరుకైన సందుల్లో లక్ష మందికి పైగా ప్రజలు గుంపులుగా ఉండటంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం వీధుల్లోకి తరలివచ్చినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా ఇరుకైన సందుల్లో ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు ఓ ప్రముఖ వ్యక్తి..

Halloween Stampede: దక్షిణ కొరియాలో తొక్కిసలాటకు కారణం ఇదేనా.. మృతుల్లో అధికులు వీరే..
Halloween Stampede
Follow us on

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఏటా జరిగే హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణ నష్టం జరిగింది. 150 మందికి పైగా మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. హాలోవీన్ వేడుకల్లో భాగంగా సియోల్‌లో శనివారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా.. అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. తొక్కిసలాట తరువాత.. ఎక్కువమంది గుండెపోటుకు గురయ్యారని.. కొందరు ఊపిరాడక చనిపోయినట్లు తెలిపారు. సియోల్‌లోని నైట్‌లైఫ్ ప్రాంతంలో ఇరుకైన సందులో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో ఎక్కువ మంది 20 ఏళ్లలోపు వారే కావడంతో ఈ ఘటనలో డ్రగ్స్ ప్రమేయం లేదని అధికారులు స్పష్టం చేశారు. అసలు ఈ ఘటనకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. హామిల్టన్ హోటల్ సమీపంలోని ఇటావాన్‌లోని ఇరుకైన సందులో వేలాది మంది ప్రజలు ఒకే చోటకు చేరారు. కోవిడ్ నేపథ్యంలో విధించిన పరిమితులు సడలించిన తర్వాత జరుగుతున్న మొదటి హాలోవీన్ వేడుక కావడంతో వేలాది మంది వీధుల్లోకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు.

దక్షిణ కొరియాకు చెందిన స్థానిక వార్త సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదటి అత్యవసర పరిస్థితిని శనివారం రాత్రి 10.22 గంటలకు ప్రకటించారు. దాదాపు ఇరుకైన సందుల్లో లక్ష మందికి పైగా ప్రజలు గుంపులుగా ఉండటంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం వీధుల్లోకి తరలివచ్చినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా ఇరుకైన సందుల్లో ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు ఓ ప్రముఖ వ్యక్తి కన్పించాడని, దీంతో వీధుల్లోకి వచ్చిన జనం సంఖ్య భారీగా పెరిగినట్లు సమాచారం. తొక్కిసలాట జరిగిన సందు వెడల్పు నాలుగు మీటర్లు మాత్రమేనని, దీంతో తొక్కిసలాట జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. తోపులాట జరుగుతుండగా.. ఆ వీధిలో ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు. అలాగే తొక్కిసలాటలో ప్రజలు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. వైద్య సహాయం అందించడానికి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ లు చేరుకోవడం చాలా కష్టమైంది. అయినప్పటికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేసి అంబులెన్స్ లకు దారివ్వాలని, ప్రజలు ఘటన జరిగిన ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని సూచించారు. అయినప్పటికి పరిస్థితిలో పెద్దగా మార్పుకనిపించలేదు.

ఇవి కూడా చదవండి

జనాన్ని తప్పించుకుని అంబులెన్స్ లు ఇరుకైన సందుల్లో వెళ్తున్నప్పటికి క్షతగాత్రుల దగ్గరకి చేరుకోవడం కష్టతరమైందని అధికారులు వెల్లడించారు. ఘటన తర్వాత కూడా ప్రజలు డ్యాన్స్ చేస్తూ.. పాటలు పాడుతూ ఉత్సాహంగా గడపడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. అంబులెన్స్‌లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోలేకపోవడంతో, వైద్య సాంకేతిక నిపుణులు క్షతగాత్రులకు సీపీఆర్ అందించడం ద్వారా అత్యవసర వైద్య సహాయాన్ని అందించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రజలంతా ఇరుకైన సందులో సామర్థ్యం మేరకు రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..