Mamata Banerjee : ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వెనకాల కూర్చోని.. రయ్ మంటూ సచివాలయానికి వెళ్లిన మమతా బెనర్జీ.. రిటర్న్‌లో ఓ ప్రయోగం చేసి కిందపడబోయింది. దిది ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయారు. పక్కన ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి ఆమె పడిపోకుండా నిలువరించారు. అనంతరం సిబ్బంది మమత నడిపే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొంత దూరం చాలా మెల్లగా, జాగ్రత్తగా తీసుకెళ్లారు. అయితే.. దాదాపు కిలోమీటర్ వరకు.. స్కూటీపై దీదీ కూర్చోని ఉంటే.. వెనకాల మరికొంతమంది బైక్‌ను ముందుకు తోస్తున్నట్లు కనిపించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసనగా సీఎం మమతా బెనర్జీ బుధవారం హౌరాలో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణించారు. సిబ్బంది ఒకరు స్కూటర్ నడుపగా ఆమె వెనుక కూర్చొని నబన్నలోని సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం సచివాలయం నుంచి కలిఘాట్‌కు వెళ్తూ ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపేందుకు మమత ప్రయత్నించారు. స్థానికులు కొందరు మాత్రం ఇందుకు సంబంధించిన తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు. దీదీ మీరు స్కూటీ భలేగా నడుపుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
కాగా.. దేశంలో పెట్రోలు, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయని, గత రాత్రి నుంచి వంట గ్యాస్ ధర కూడా పెరిగిందని దీదీ అన్నారు. అందుకే ఈ స్కూటీ ప్రయాణం చేశానని చెప్పారు. హెల్మెట్, మాస్క్ కూడా ధరించి ఆమె ఈ ”విచిత్ర యాత్ర’ చేశారు. ప్రధాని మోదీ ఈ దేశాన్ని అమ్మివేస్తున్నారని, ఈ ప్రభుత్వం రైతుల, ప్రజల, మహిళల, యువత వ్యతిరేక ప్రభుత్వమని ఆమె ఆరోపించారు. ఈ సర్కార్ గద్దె దిగాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజల గోడు పట్టదని, పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచడం దారుణమని ఆమె అన్నారు. బెంగాల్ లో వచ్ఛే ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా బీజేపీని ఎదుర్కొనేందుకు మమత ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోంది. రాష్ట్రంలో తృణమూల్, కాంగ్రెస్, బీజేపీ మధ్య రోజురోజుకీ ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వ సాధారణమయ్యాయి. ఇటీవల హుగ్లీ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ రాష్ట్రంలో టీఎంసీ పాలనను తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్రం బెంగాల్ కు 1700 కోట్ల గ్రాంటును ఇస్తే అందులో 608 కోట్ల గ్రాంటును మాత్రమే ఖర్చు చేసిందని, మిగిలిన సొమ్మంతా ఏమైందని ఆయన ప్రశ్నించారు.