Viral Video: పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌లో అరుదైన సన్నివేశం.. కాబోయే తల్లికి ఖాకీల శ్రీమంతం..!

|

Feb 19, 2022 | 5:04 PM

పశ్చిమగోదావరి. జిల్లాలోని పెనుగొండ పోలీసులు వినూత్నమైన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు స్టేషన్ లో పని చేసే కానిస్టేబుల్‌కు శ్రీమంతం చేసి ఆమె పట్ల వారికి ఉన్న వాత్సల్యాన్ని చాటుకున్నారు.

Viral Video: పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌లో అరుదైన సన్నివేశం.. కాబోయే తల్లికి ఖాకీల శ్రీమంతం..!
Seemantham
Follow us on

Andhra Pradesh: మేజర్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటే..వారి ప్రేమకు పెద్ధలు భరోసా ఇస్తే పోలీసులు వారికి చట్ట పరమైన రక్షణ కల్పిస్తారు. అవసరమైతే పెద్ధలను సైతం పిలిచి కౌన్సెలింగ్ ఇస్తారు. ఇక స్టేషన్ లో పని చేసే సిబ్బంది కుటుంబ సభ్యులకు సంబంధించి ఏ వేడుకలు జరిగినా పాల్గొనటం ఆనవాయితీగా చాలా చోట్ల జరుగుతుంది. కానీ, పశ్చిమగోదావరి. జిల్లాలోని పెనుగొండ పోలీసులు వినూత్నమైన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు స్టేషన్ లో పని చేసే కానిస్టేబుల్‌కు శ్రీమంతం చేసి ఆమె పట్ల వారికి ఉన్న వాత్సల్యాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెలితే…. మాతృత్వాన్ని స్త్రీ ఒక వరంగా భావిస్తుంది. తమ కోడలు, కూతురో తల్లి కాబోతుందని తెలిస్తే.. ఇక ఆ కుటుంబాల్లో సంతోషం నిండుకుంటుంది. తల్లి కాబోతున్న ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇక, ఏడో నెలలో కాని, తొమ్మిదో నెలలో కాని చేసే శ్రీమంతం తల్లి కాబోతున్న ఆమెకు.. అందరూ ఇచ్చే ఆశీర్వాదాలు కొండంత థైర్యం నింపుతాయి. ఇలాంటి ఒక పండుగను పుట్టింటి తరుపున అత్తవారింటి తరుపునా కాక మరొకరు చేశారు. వారే సహ ఉద్యోగులు.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లీలారాణి సీమంతంను పెనుగొండ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్‌పెక్టర్ మోహన్ రావు, సహోద్యోగులు ఘనంగా నిర్వహించారు. ముత్తయిదువులు, పేరాంటాళ్లను పిలిచి అందరితోనూ అక్షింతలు వేయించారు. పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు. పసుపు, కుంకుమలు, గాజులు, పూలు, పండ్లు , గంధం,అక్షింతలతో ముత్తయిదువులుగా ఉన్న ఉద్యోగులు గాజులు తొడిగి.. పెద్ద మనసుతో ఆశీర్వదించారు.

సీమంతం అనే వేడుక జరపడం వలన నెలలు సమీపించే సమయంలో ప్రసవంపై భయం తొలిగి బంధువులు అందరూ తనకు అండగా ఉన్నారనే ధైర్యం ఇస్తుందంటారు. ఆ స్త్రీమూర్తికి మానసికపరమైన ఉల్లాసం లభిస్తుంది. ముత్తయిదువులంతా వచ్చి ఆశీర్వదించడం , వారి ఆశీర్వాదం తీసుకోవటం శుభకరంగాను భావి స్తుంటారు. కేసులు, దర్యాప్తులు, ఫిర్యాదులు, సమస్యలతో నలిగిపోయే పోలీసులు కాస్త ఆ టెన్షన్ ను పక్కన బెట్టి ఇలా కార్యక్రమం చేయటంతో కానిస్టేబుల్ లీలారాణి పట్టరాని సంతోషం పొందింది. ఇగోలకు పోయే తోటి ఉద్యోగుర మథ్య యాంత్రికంగా స్నేహం చేయటం అలవాటు చేసుకోవటం కంటే ఫర్ ఎ ఛేంజ్ ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఉద్యోగుల మధ్య స్నేహభావం పెరిగే విధంగా ఉంటుందంటున్నారు మానసిక నిపుణులు.

బి.రవి కుమార్, టీవీ 9 ప్రతినిధి, పశ్చిమ గోదావరి జిల్లా