Viral Video: బస్తాలో చిల్లర తీసుకుని షోరూమ్‌కు వెళ్లిన వ్యక్తి.. షాకైన సిబ్బంది.. నెటిజన్లు ఫిదా.!
ప్రతి వ్యక్తి తన చిరకాల కోరికను నెరవేర్చుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. అందుకు ఒక్కోసారి చాలా శ్రమపడాల్సి వస్తుంది....
ప్రతి వ్యక్తి తన చిరకాల కోరికను నెరవేర్చుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. అందుకు ఒక్కోసారి చాలా శ్రమపడాల్సి వస్తుంది. ధనవంతులైతే వారి కోరికలు త్వరగానే నెరవేరుతాయి. మరి సామాన్యుల పరిస్థితి.. వారి కల నెరవేర్చుకోడానికి ఎంతో కాలం పడుతుంది… పట్టుదలతో ప్రయత్నిస్తే సమయం పట్టినా కల నెరవేరుతుంది. అదే చేశాడు అస్సాంకు చెందిన ఓ వ్యక్తి. ఇతనికి ఒక బైక్ కొనుక్కోవాలని చిరకాల కోరిక. ఇతడు ఓ చిన్న స్టేషనరీ షాపును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన కల నెరవేర్చుకోడానికి కొంచెం కొంచెం చిల్లరను ఒక బస్తాలో పోగు చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని నెలల తర్వాత ఆ బస్తా నిండటంతో… ఆ బస్తాను తీసుకొని ఒక షోరూమ్‌కి వెళ్లాడు. ఆ బస్తాను చూపించి తనకు ఒక స్కూటర్ కావాలని అడిగాడు…
మొదట ఆ వ్యక్తిని, ఆ బస్తాను చూసి షోరూమ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు…అయినా ఆ సిబ్బంది విసుక్కోకుండా ఆ చిల్లర మొత్తం లెక్కపెట్టి అతనికి స్కూటర్ తాళాలు, పత్రాలు అందించారు. దాంతో అతడు తన చిరకాల కోరిక నెరవేరినందుకు ఎంతో ఆనందపడిపోయాడు. అస్సాంలోని బార్పేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. యూట్యూబర్ హిరాక్ జే దాస్ తన ఫేస్‌బుక్‌లో దీని గురించి పోస్ట్ చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ‘ఒక కలను నెరవేర్చుకోవడానికి చాలా డబ్బు అవసరమవుతుంది. అయితే కొద్దికొద్దిగా పొదుపు చేయడం ద్వారా కొన్నిసార్లు ఆ కల నెరవేరుతుంది’ అంటూ దాస్ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ వ్యక్తిని అభినందించారు. మరి కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.