AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలాత్రిపురసుందరిగా విజయవాడ దుర్గమ్మ దర్శనం

బాలాత్రిపురసుందరిగా విజయవాడ దుర్గమ్మ దర్శనం

Phani CH
|

Updated on: Sep 22, 2025 | 5:49 PM

Share

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మలగన్నయమ్మ జగన్మాత వాడవాడలా నవరాత్రి పూజలు అందుకుంటోంది. వివిధ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక అలంకరణలతో అమ్మవారిని పూజిస్తున్నారు భక్తులు. ఈ క్రమంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందడి మొదలైంది. సోమవారం నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తొలి రోజు కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 8:30 గంటల మధ్య భక్తులను దర్శనానికి అనుమతించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన నిత్యపూజల మందిరం, రెండో యాగశాలను కూడా వారు ప్రారంభించారు. దసరా ఉత్సవాల దృష్ట్యా భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ అధికారులు పలు కీలక మార్పులు చేశారు. గతంలో గాయాలకు కారణమవుతున్న ఇనుప కంచెల స్థానంలో, ఈసారి సురక్షితమైన ‘ఫ్రేమ్ మోడల్’ క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు బయటకు వచ్చేందుకు వీలుగా ప్రతి 50 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ గేటును అమర్చారు. ఆ ద్వారానికి ఎరుపు రంగు వేసి, ప్రత్యేక బోర్డులతో స్పష్టంగా గుర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నవరాత్రుల్లో రూ. 500 ప్రత్యేక దర్శనం టికెట్‌ను రద్దు చేసి, కేవలం రూ. 300, రూ. 100, ఉచిత దర్శన క్యూలను మాత్రమే అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీని లెక్కించేందుకు హెడ్-కౌంట్ కెమెరాలు, కొండ పరిసరాలను పర్యవేక్షించేందుకు 500 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థను సిద్ధం చేశారు. ఇందుకోసం మోడల్ గెస్ట్‌హౌస్‌లో, మహామండపంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అమ్మవారి పూజలు, హోమాలను వీక్షించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను అమర్చారు. దర్శనానికి పట్టే సమయం, క్యూలైన్ల ప్రస్తుత పరిస్థితి వంటి వివరాలను కూడా ఈ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. భక్తుల కోసం కనకదుర్గ నగర్‌లో 12 లడ్డూ ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయగా, వాటిలో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు కేటాయించారు. ఉత్సవాల బందోబస్తు కోసం మొత్తం 6,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. దేవదాయ శాఖ నుంచి 500 మంది, పారిశుద్ధ్య నిర్వహణకు 1400 మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించనున్నారు. మొత్తంమీద, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పండగ వేళ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. పిడుగులతో కూడిన వర్షాలు

Published on: Sep 22, 2025 05:46 PM