Panda : ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన అన్ అన్ ఇక లేదు.. 35 ఏళ్ల మగ పాండాకు కారుణ్య మరణం..!
సుదీర్ఘకాలం జీవించిన మగ పాండాగా గుర్తింపు పొందిన అన్ అన్ ఇక లేదని తెలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జంతుప్రేమికులు.
Panda : ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన మగ పాండాకు పశువైద్యులు కారుణ్య మరణాన్ని ప్రసాదించారు. సుదీర్ఘకాలం పాటు జీవించిన మగ పాండా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. హాంగ్ కాంగ్ ఓషన్ పార్కులో ఉన్న ఈ పాండా వయసు ప్రస్తుతం 35 ఏళ్లు.. అంటే మానవుల్లో 105 సంవత్సరాలతో సమానం. అనారోగ్యంతో గత మూడువారాలుగా బాధపడుతుండడంతో దీనిని చూసేందుకు సందర్శకులను అనుమతించలేదు. హాంకాంగ్ ఓషన్ పార్కులో ఉన్న ఈ పాండా ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన మగపాండాగా రికార్డులకెక్కింది. ఇటీవల దాని ఆరోగ్యం మరింత క్షిణీంచింది. దీంతో అది మరింత బాధపడకుండా ఉండేందుకు ఓషన్ పార్క్ పశువైద్యులు గురువారం రోజు కారుణ్య మరణాన్ని ప్రసాదించారు. సుదీర్ఘకాలం జీవించిన మగ పాండాగా గుర్తింపు పొందిన అన్ అన్ ఇక లేదని తెలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జంతుప్రేమికులు.
అన్ అన్ 1999 నుంచి హాంకాంగ్ ఓషన్ థీమ్ పార్క్‌లో ఉంటోంది. గత పదిరోజులుగా అది తిండి తగ్గిస్తూ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నా.. అది ఎందుకలా చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. బలవంతంగా తినిపించే ప్రయత్నం చేసినా.. ప్రయత్నాలు ఫలించలేదు. అన్ అన్‌తోపాటు జియా జియా అనే ఆడపాండాను 1999లో హాంకాంగ్‌కు చైనా బహుమతిగా ఇచ్చింది. అన్ అన్ 1986లో చైనాలోని సిచువాన్‌లో జన్మించింది. జియాజియా 2016లో 38 ఏళ్ల వయసులో మృతి చెందింది. పాండాల సంరక్షణకు మారుపేరుగా ఉన్న హాంకాంగ్‌లో.. వాటి జనాభా మాత్రం అంతగా వృద్ధి చెందడం లేదు. మరోవైపు చైనా నుంచే కానుకల రూపంలో వచ్చిన యింగ్ యింగ్, లే లే పాండాలతో సంతానోత్పత్తి చేయించాలన్న పదిహేనేళ్ల ప్రయత్నాలు ఫలించడం లేదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి