జూకి వెళ్లినప్పుడు.. ప్రతీ చోటా ‘జంతువుల దగ్గరకు వెళ్లొద్దు’ అనే వార్నింగ్ బోర్డ్స్‌ను మీరు చూసే ఉంటారు. కొంతమంది ఆకతాయిలు వాటిని పట్టించుకోకుండా జంతువుల బోన్‌లోకి ఉరకడం, లేకపోతే దగ్గరగా వెళ్లి వాటిని ఎగతాళి చేస్తుంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఇటీవల ఇండోనేషియాలో జరిగింది. ఇక్కడ ఓ వ్యక్తి చేసిన వెకిలి చేష్టకు.. ప్రతిఫలంగా వచ్చిన రియాక్షన్ ఏంటో మీరు చూస్తే కచ్చితంగా షాకవుతారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఆకతాయి.. గొరిల్లా బంధించి ఉన్న బోన్ దగ్గరకు వెళ్లి వెకిలి చేష్టలు చేశాడు. ఆ జంతువుకు ఎక్కడలేని కోపం వచ్చి.. ఆ యువకుడి షర్ట్ పట్టుకుని దగ్గరకు లాగుతుంది. మరో వ్యక్తి అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఆ గొర్రిల్లా అతడి కాలు పట్టుకుని బోన్‌లోకి లాగేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
lu yang berak ya? pic.twitter.com/FVKE6DUV2r
— neutral⚛ (@neutralizm_) June 7, 2022
ఈ వీడియోను ‘neutral’ అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దీనికి ఇప్పటివరకు 12.5 మిలియన్ వ్యూస్, 5300 లైకులు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇక ఈ ఘటన జూన్ 6న ఇండోనేషియాలోని కసంగ్ కులిం జూలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జూ అధికారులు లంచ్ విరామంలో ఉండగా ఈ సంఘటన జరిగిందని.. జంతువులకు దగ్గరగా వెళ్ళకూడదని వార్నింగ్ బోర్డులు పెట్టినా.. ఆ యువకుడు వాటిని ఉల్లంఘించి గొర్రిల్లా బోన్ దగ్గర ఉన్న గార్డ్‌రైల్ దూకి మరీ.. ఆ జంతువును ఎగతాళి చేశాడని జూ అధికారి ఒకరు తెలిపారు.