
వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు నీళ్లే ప్రాణాధారం. అలాంటి నీటి కోసం ఏళ్ల తరబడి పోరాడి, అధికారుల హామీలతో విసిగిపోయిన రైతులు చివరికి ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడరనడానికి మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. సోలాపూర్ జిల్లా మఢా తాలూకాలోని తులసి గ్రామ ప్రజలు తమ ఊరిని ఏకంగా విక్రయానికి పెడుతూ గ్రామం ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది?
తులసి గ్రామానికి సమీపంలోనే ‘సీనా-మాఢా’ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఉన్నప్పటికీ, ఈ గ్రామానికి సాగునీరు అందడం లేదు. దశాబ్దాలుగా పాలకులు, అధికారులు కేవలం ప్రాజెక్టు హామీలకే పరిమితమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోవడం, బావులు, బోర్లలో నీటిమట్టం పాతాళానికి పడిపోవడంతో గ్రామస్థుల సహనం నశించింది. ప్రతిసారీ వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో, గ్రామం వెలుపల పెద్ద అక్షరాలతో “ఈ తులసి గ్రామం విక్రయానికి ఉంది.. కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నవారు రావచ్చు” అంటూ పోస్టర్లు వెలిశాయి.
తులసి గ్రామ సర్పంచ్, స్థానిక రైతులు మాట్లాడుతూ.. మా గ్రామాన్ని నడుపుకోవడానికి, పంటలు పండించుకోవడానికి నీరు లేనప్పుడు ఈ భూములు ఉన్నా ప్రయోజనం లేదు. అందుకే గ్రామాన్ని అమ్మకానికి పెట్టాం అని తమ నిరసన వెనుక ఉన్న వేదనను వ్యక్తం చేశారు. గతంలో గణేష్ చతుర్థి సందర్భంగా నిరాహార దీక్షలు, ఎన్నికల బహిష్కరణ హెచ్చరికలు కూడా చేశారు.
ఈ వినూత్న నిరసనకు సంబంధించిన ఫ్లెక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగంలో కలకలం రేగింది. సోలాపూర్ జిల్లా కలెక్టర్ కార్తికేయన్ మరియు జలవనరుల శాఖ అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి కాలువల ద్వారా నీటిని అందించేందుకు హైడ్రోలాజికల్ సర్వే నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.
తులసి గ్రామస్తులు చేపట్టిన ఈ నిరసన కేవలం ఒక ఊరి సమస్య మాత్రమే కాదు, వర్షాభావం మరియు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై పాలకుల కళ్లు తెరిపించే ఒక హెచ్చరికగా నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..