మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. పిల్లలకు చెప్పవల్సిన నీతి కథ
మనం ఇతరులకు చేసిన మంచి ఎప్పుడూ వృథా కాదు. దయ, సహాయం, మంచితనం ఏదో ఒక రూపంలో తిరిగి మనకే మేలు చేస్తాయి. ప్రతిఫలం ఆశించకుండా మంచి చేయడం మన జీవితంలో గొప్ప గుణం అని చెప్పే నీతి కథ ఇది. పిల్లలకు చిన్నతనంలోనే ఇలాంటి విలువలు ఉన్న కథలు చెబితే వారు ఉన్నత వ్యక్తిత్వంతో ఎదుగుతారు..

ఒక చిన్న గ్రామంలో ఓ కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో కష్టపడి పని చేసేవాడు. ఒకరోజు తన పొలాన్ని దున్నుతుండగా, పక్కనే ఉన్న పాత గోడ దగ్గర నుంచి ఒక పక్షి అరుపులు వినిపించాయి. రైతు దగ్గరికి వెళ్లి చూడగా ఒక పెద్ద గద్ద వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుని ప్రాణాల కోసం తల్లడిల్లుతోంది. గద్ద ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. దాన్ని చూసిన రైతుకు జాలి వేసింది.
ఈ మూగజీవి ఎంత బాధపడుతోంది! అని భావించిన రైతు తన పనిని పక్కన పెట్టి జాగ్రత్తగా వలను విప్పి గద్దను విడిపించాడు. గద్ద కొద్దిసేపు రైతు వైపు కృతజ్ఞతగా చూసి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండటంతో రైతు చాలా అలసిపోయాడు. మధ్యాహ్నం సమయంలో అదే గోడ పక్కన ఉన్న చెట్టు నీడలో పడుకుని నిద్రపోయాడు. అప్పుడే ఆ గోడలోని రంధ్రం నుంచి ఒక విషపాము బయటకు వచ్చింది. నిద్రలో ఉన్న రైతు వైపు నెమ్మదిగా పాకసాగింది. రైతుకు ఆ ప్రమాదం గురించి ఏమాత్రం తెలియదు.
ఆకాశంలో ఎగురుతున్న అదే గద్ద రైతును చూసింది. రైతు తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి అని గుర్తుపట్టింది. రైతు దగ్గరకు పాము చేరుకుంటున్న విషయాన్ని గమనించి వెంటనే కిందికి దూసుకొచ్చింది. గద్ద తన బలమైన గోళ్లతో పామును పట్టుకుని రైతు దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్లింది. కొంతసేపటికి రైతు మేల్కొన్నాడు. పాము ఆనవాళ్లు చూసి, గద్ద తన ప్రాణాలను రక్షించిందని అర్థం చేసుకున్నాడు. రైతు హృదయం ఆనందంతో నిండిపోయింది. తాను చేసిన చిన్న సహాయం తన ప్రాణాలను కాపాడేంత పెద్ద మేలుగా తిరిగి వచ్చిందని గ్రహించాడు.
నీతి
మనం ఇతరులకు చేసిన మంచి ఎప్పుడూ వృథా కాదు. ఏదో ఒక రూపంలో అది తిరిగి మనకే మేలు చేస్తుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. అలాగే చెడు చేస్తే చెడే జరుగుతుంది. Good deeds always come back to help you అనే విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.




