
సినిమా కథను తలపించేలా ఒక షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లో వెలుగు చూసింది. MIG పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన శ్రద్ధా తివారీ అనే యువతి తన ప్రేమికుడు సార్థక్‌ను వివాహం చేసుకోవడానికి ఇంటి నుంచి పారిపోయింది. కానీ, ఒక వారం తర్వాత మరొక వ్యక్తిని వివాహం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఈ సంఘటన యువతి తల్లిదండ్రులు, బంధుమిత్రులతో పాటుగా ప్రతి ఒక్కరినీ షాక్ అయ్యేలా చేసింది. ప్రేమ కోసం ఆ యువతి ఇంటి నుంచి పారిపోవటం, మరొక యువకుడిని పెళ్లి చేసుకుని తిరిగి ఇంటికి రావటం స్థానికుల్లో తీవ్ర విస్తృత చర్చకు దారితీసింది. అసలు విషయంలోకి వెళితే…
ఇండోర్‌లో ఉంటున్న 18 ఏళ్ల శ్రద్ధ తివారీ ప్రేమికుడు సార్ధక్‌తో పెళ్లి చేసుకోవడానికి ఆగస్టు 23న ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారిద్దరూ ముందుగా అనుకున్నట్టుగానే ఆమె రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కానీ, తన ప్రియుడు సార్ధక్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే, రైల్వే స్టేషన్‌కి రాని సార్ధక్ చివరికి పెళ్లి చేసుకోనని తిరస్కరించాడు. నిన్ను పెళ్లి చేసుకోలేను అంటూ శ్రద్ధాకు ఫోన్ చేసి చెప్పాడు. అది విన్న శ్రద్ధాకు ఒక్కసారిగా గుండెపగిలిపోయినంత పనైంది. ఇంటి నుంచి పారిపోయిన వచ్చిన ఆమెకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది.
నిరాశతో ఒంటరిగా కూర్చున్న శ్రద్ధను కాలేజీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న కరణ్‌దీప్ గమనించాడు. విషయం తెలుసుకుని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఆమెను తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని, తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలియజేయాలని అతను సూచించాడు. సార్థక్ చేసిన మోసానికి శ్రద్ధా ఎంతగానో కుమిలిపోయింది. తిరిగి వెళ్ళడానికి నిరాకరించింది. నేను పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుండి బయలుదేరాను. పెళ్లి చేసుకోకుండానే తిరిగి వెళితే, నేను బతకలేను అని ఆమె కరణ్‌దీప్‌తో చెప్పింది. ఆమెను ఒప్పించడానికి అతను పదే పదే ప్రయత్నించినప్పటికీ, ఆమె మాట వినలేదు. చివరికి కరణ్‌దీప్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు శ్రద్ధా అంగీకరించింది. చివరికి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులు వారిని ఇంటికి తీసుకువచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..