టెక్ ఉద్యోగాల్లో భారీ కోతలు.. 8 నెలల్లో.. 1.23 లక్షల మంది ఔట్!
ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల్లో కోతలు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధ పరిస్థితులు, ఉద్యోగులపై వ్యయాల తగ్గింపు, కృత్రిమ మేధపై (AI) భారీగా పెట్టుబడులు పెడుతుండటం వంటి కారణాల వల్ల టెక్ కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతూ ఆందోళనలో పడుతున్నారు.

గత ఏడాది మొత్తం మీద 278 కంపెనీలు 1,22,606 మందిని తొలగిస్తే, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మందే ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటివరకు 8 నెలల్లోనే 1,23,300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఒరాకిల్, అమెజాన్, డెల్, మెటా వంటి పెద్ద కంపెనీలు వరుసగా ఉద్యోగులను తీసేస్తున్నాయి . కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలని చూడటం, భవిష్యత్తు కోసం ‘ఏఐ’ పై పెట్టుబడులు పెంచడం కారణాలుగా తెలుస్తోంది. “లేఆఫ్స్‌డాట్ ఎఫ్‌వైఐ” (Layoffs.fyi) అనే సంస్థ ఇచ్చిన తాజా నివేదికలో ఈ వివరాలు తెలిశాయి. ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉన్నాయి, ఇంకెందరి ఉద్యోగాలు పోతాయోనని టెక్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
కంపెనీలు పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. వేర్వేరుగా ఉన్న చిన్న టీమ్ లను ఒకటిగా మారుస్తున్నాయి. మేనేజ్‌మెంట్ స్థాయి అధికారుల సంఖ్యను తగ్గించి, పనులను నేరుగా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. కొన్ని రకాల సాధారణ పనులను మనుషుల ప్రమేయం లేకుండా వాటంతట అవే జరిగేలా, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతకు తగినట్లుగా ఉద్యోగుల టీమ్ లను కొత్త పద్ధతుల్లో మారుస్తున్నారు.
ఈ ఏడాదిలో ఎక్కువ మందిని తొలగించిన కంపెనీల్లో ఒరాకిల్ మొదటి స్థానంలో ఉంది. ఎనిమిది నెలల్లోనే 21 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ 17,267 మందిని, డెల్ 11,000, మెటా 10,400, మైక్రోసాఫ్ట్ 4,800 మందిని పేపాల్, సిస్కో, బ్లాక్ వంటి కంపెనీలు 4,000 మంది చొప్పున ఉద్యోగులను తొలగించాయి. తాజాగా జొమాటో సంస్థ 250 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఒరాకిల్ సంస్థ త్వరలో మరో 3,000 నుంచి 4,000 మందిని తొలగించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ లేఆఫ్స్ ప్రకటిస్తే, తొలగింపునకు గురయ్యే వారిలో దాదాపు 3 వేల మంది వరకు భారత్‌లోనే పనిచేస్తున్న ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ టెక్నాలజీస్ తాజాగా 3,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, మొత్తం ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కంపెనీలో మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగులను తగ్గించడం, రోబోట్యాక్సీ, రైడ్ షేరింగ్, డెలివరీ విభాగాల్లో చేస్తున్న ఖర్చులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.