
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగాయి. బుధవారం అర్ధరాత్రి మహాశివుని లింగోద్భవ శుభవేళ భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అంతకుముందు వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ క్రమంలో పలుచోట్ల అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఆ పశుపతినాథుని కళ్యాణం చూసి మానవాళిమాత్రమే కాదు… ప్రకృతి సైతం పరవశించిందా అనిపించింది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుని దర్శనానికి సాక్షాత్తు ఆదిశేషుడే తరలివచ్చాడా అనిపించే అద్భుత దృష్యం నిర్మల్ జిల్లా శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా నాగుపాము దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
దస్తురాబాద్ మండలం గొడిసిర్యాల శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. వేలాదిమంది భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణమహోత్సవంలో పాల్గొని తరించారు. ఈ క్రమంలో ఎక్కడినుంచి వచ్చిందో ఎలా వచ్చిందో కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన మైక్ సిష్టం వద్ద పగడవిప్పి నిల్చుని ఆసాంతం కళ్యాణం వీక్షించింది. భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా.. తన స్వామి అమ్మవారి కళ్యాణం చూసేందుకే అక్కడికి వచ్చినట్టుగా కన్నులపండువగా శివపార్వతుల కళ్యాణం వీక్షించింది. ఈ దృశ్యం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. భక్తులు సైతం మహాశివరాత్రి శుభవేళ ఇలా సాక్షాత్తూ నాగేంద్రుడే దర్శనం ఇచ్చారంటూ భక్తితో నమస్కరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం ఇది ఆ పరమేశ్వరుడి మహిమే అంటూ భక్తితో కామెంట్లు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలోనూ ఇలా నాగుపాము ప్రత్యక్షమై భక్తులను దర్శనమిచ్చింది. ఓదెల మండల కేంద్రంలోని శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించిన నాగదేవత విగ్రహం వద్ద బుధవారం నాగుపాము భక్తులకు కనిపించింది. శివుడికి కంఠాభరణంగా ఉండే పాము మహాశివరాత్రి పర్వదినం రోజు దర్శనమిచ్చిందంటూ పలువురు భక్తులు పూజలు చేశారు.