Viral Video: ఇంటి సీలింగ్‌లో ఏదో తారసలాడుతూ కనిపించింది.. తీరా చూడగా వామ్మో.. వీడియో
పాము అంటే అందరికీ భయమే. అది ఇంట్లో దూరిందంటే ఆ కుటుంబం అంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. తాజాగా ఓ ఇంట్లో పాము దూరింది. అది నేరుగా సీలింగ్ ప్యానెల్‌లో ఉన్న గ్లాస్‌పై అటూ ఇటూ తిరుగుతుండడం చూసి ఇంట్లోని వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఇంట్లో పాము కనిపిస్తేనే గుండెలు గుభేల్ మంటాయి. ఇక అది ఇంట్లో ఉన్న సీలింగ్ ప్యానల్‌లోకి దూరితే ఆ ఇంట్లోని వారి పరిస్థితి ఎలా ఉంటుంది? కళ్లకు కనిపించని పాము ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ కాటు వేస్తుందో అన్న భయంతో వణికిపోతారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇలాంటి భయంకరమైన ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా ఇంటి సీలింగ్ ప్యానల్‌లోకి ఒక పాము చొరబడి అందరినీ హడలెత్తించింది. దీనితో ఆ ఇంటి యజమానులు రాత్రంతా నిద్రలేకుండా గడపాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే, నోయిడా సెక్టార్ 51లోని ఒక ఇంట్లో కుటుంబసభ్యులు హాయిగా నిద్రిస్తున్న సమయంలో పైకప్పు నుంచి వింత శబ్దాలు వినిపించాయి. మొదట దాన్ని ఫ్యాన్సీ సీలింగ్ లైటుకు సంబంధించిన వైరింగ్ సమస్య అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ లైటు పక్కనే ఒక పాము కదులుతూ కనిపించింది. అది కాసేపటికి సీలింగ్ ప్యానల్‌లోకి దూరిపోయి అటూ ఇటూ తిరుగుతూ వారికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ ఇంటి యజమానులు దాన్ని బయటకు పంపించేందుకు చాలా ప్రయత్నించారు, కానీ ఫలితం లేకపోయింది. సీలింగ్ ప్యానల్‌లో ఇరుక్కుపోవడంతో దాన్ని బయటకు ఎలా తీసుకురావాలో తెలియక వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
చేసేదేమీ లేక వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపు ఆ పాము ఎక్కడ బయటకు వస్తుందోనని భయంతో ఆ కుటుంబం రాత్రంతా ఇంటి బయటే గడపాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు దారితీసింది. వర్షాకాలంలో కాలువలు, పొదల నుంచి పాములు ఇళ్లలోకి రావడం సాధారణమే అయినా, ఇలా సీలింగ్ ప్యానల్‌లోకి పాము దూరిపోవడం కొత్త భయాన్ని కలిగిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాములు ఇళ్లలోకి రాకుండా ఇంటి పైకప్పులు, బాత్రూమ్‌లలోని కిటికీలు వంటి వాటిని ఎప్పుడూ మూసి ఉంచుకోవాలని చెప్పారు. అలాగే, ఇంటి చుట్టూ ఉన్న పొదలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, పైకప్పు గోడలలో ఏవైనా పగుళ్లు ఉంటే వెంటనే వాటిని పూడ్చివేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇళ్లలో పాములు కనిపిస్తే వాటికి హాని చేయకుండా, వెంటనే అటవీ సంరక్షణ విభాగానికి సమాచారం అందించాలని కోరారు.
