Viral Video: రోబోలు మానవాళికి ముప్పుగా మారుతున్నాయా.? సాక్ష్యంగా నిలుస్తోన్న తాజా సంఘటన..

Viral Video: భవిష్యత్తు అంతా రోబోలదే అనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మనుషులు చేసే ఎన్నో పనులను రోబోలు చేస్తున్నాయి. ఒకమాటలోనే చెప్పాలంటే మనుషుల కంటే పర్ఫెక్షన్‌తో, వేగంతో రోబోలు పనిచేస్తున్నాయి...

Viral Video: రోబోలు మానవాళికి ముప్పుగా మారుతున్నాయా.? సాక్ష్యంగా నిలుస్తోన్న తాజా సంఘటన..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 25, 2022 | 12:12 PM

Viral Video: భవిష్యత్తు అంతా రోబోలదే అనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మనుషులు చేసే ఎన్నో పనులను రోబోలు చేస్తున్నాయి. ఒకమాటలోనే చెప్పాలంటే మనుషుల కంటే పర్ఫెక్షన్‌తో, వేగంతో రోబోలు పనిచేస్తున్నాయి. అయితే రోబోల వినియోగం ఏదో ఒక రోజు మనుషులకు మనుగడకే ముప్పుగా మారుతుందనే వాదనలు కూడా ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి. రోబోలకు మనుషుల్లాగా ఆలోచించే శక్తి వస్తే.. అవి మనుషులపై తిరగబడే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందన్న కథాంశంతో ఎన్నో ఫిక్షనల్‌ స్టోరీస్‌ సినిమాలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన నిజంగానే రోబోలు మనుషులకు ముప్పుగా మారుతాయా.? అన్న వార్తలకు బలం చేకూర్చాయి. రష్యాలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. మాస్కోలో చెస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రోబోలతో చెస్‌ పోటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఓ కుర్రాడితో రోబో చెస్‌ ఆడుతోంది. మొదట్లో బాగానే ఆడిన రోబో.. ఒకానొక సమయంలో పావును కదిపిన తర్వాత కుర్రాడి వేళ్లపై గట్టి నొక్కేసింది. ఎంత ప్రయత్నించినా రోబో నుంచి చేయి విడిపించుకోకపోవడం వీలుకాక పోవడంతో చుట్టూ ఉన్న వారు వచ్చి కుర్రాడిని రక్షించారు.

ఈ విషయమై మాస్కో చెస్‌ ఫెడరేషన్‌ నిర్వాహకుడు మాట్లాడుతూ.. రోబో వేగంగా పావులను కదిపే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ రోబోను చెస్‌ టోర్నీ నిర్వాహకులు రెంట్‌ తీసుకొని కొన్ని ప్రదేశాల్లో ఎగ్జిబిషన్‌కు ఉంచుతున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూసుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. కుర్రాడి వేలుకు ఫ్రాక్చర్‌ అయ్యిందని అయితే తర్వాతి రోజు పక్కవారి సహాయంతో చెస్‌ ఆడేందుకు టోర్నీకి హాజరయ్యాడని, కుర్రాడికి అవసరమైన సహాయం చేస్తామని చెస్‌ ఫెడరేషన్‌ హామీ ఇచ్చింది.

గన్ తో రెచ్చి పోయిన రోబో డాగ్..

రోబోలు మనుషులకు ముప్పుగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అయ్యింది. ఇందులో ఓ రోబో డాగ్‌ మిషన్‌ గన్‌ను చేతబట్టి, విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. శత్రువులపై దాడి చేయడానికి రూపొందించిన ఈ రోబో డాగ్‌ పొరపాటున కమాండ్స్‌ ఇచ్చిన వారిపై ఎదురు తిరిగితే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉంటుంది. అలాగే ఉగ్రవాదులు ఇలాంటి రోబోలను లోబర్చుకున్నా నష్ట అంచనాలు మించి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోడింగ్‌లో కానీ, ఇచ్చే ఆదేశాల్లో కానీ ఏమాత్రం పొరపాటు జరిగినా ఆలోచన లేని రోబో ఎవరిపై పడితే వారిపై బుల్లెట్ల వర్షం కురిపించే ప్రమాదం కూడా ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..