పెళ్లిళ్లలో బ్యాండ్, టెంట్లు, కూర్చీలు, వంటసామాగ్రి వంటివి అద్దెకు తీసుకోవటం తెలుసు.. ఇటీవలి కాలంలో డిజైనర్ లెహంగాలు, ఖరీదైన బట్టలు కూడా అద్దెకు లభిస్తున్నాయి. కానీ ఇప్పుడు వధూవరులు కూడా అద్దెకు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ మండపంలో కలకలం సృష్టించిన అద్దె పెళ్లికొడుకు ఉదంతం వెలుగులోకి వచ్చింది. రూ.2000 కోసం ఓ వ్యక్తి పెళ్లికొడుకుగా మారి కల్యాణ మండపం వద్దకు చేరుకుని పట్టుబడ్డాడు. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం?
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో మంగళవారం జరిగిన సామూహిక వివాహల వేడుకల సందర్భంగా కిరాయి పెళ్లి కొడుకు పట్టుబడటంతో ఇటు స్థానికులు, అటు అధికారుల్లోనూ కలకలం రేపింది. సామూహిక వివాహల సందర్భంగా 300 జంటలు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 265 జంటలను వివాహానికి ఎంపిక చేశారు అధికారులు. వివాహానికి ముందు, ప్రొబేషన్ డిపార్ట్‌మెంట్ జంటలందరి సర్టిఫికెట్లు చెక్ చేశారు. వారు అర్హులా కాదా అని వివరాలు క్షుణంగా పరిశీలించిన తరువాత పెళ్లికి ఏర్పాట్లు చేశారు. మండపంపై వేద పండితులు సిద్ధంగా ఉన్నారు. బ్యాండ్‌మెన్‌లు, షెహనాయ్‌లతో వివాహ వేడుకను ప్రారంభించారు. అయితే, పెళ్లి తంతూ ప్రారంభించే క్రమంలోనే అద్దె వరుడి అసలు రూపం బయటపడింది.
సప్తపది సమయంలోనే వరుడి ప్రవర్తపై అనుమానం వచ్చిన అధికారులు అతన్ని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వరుడిని పక్కకు తీసుకెళ్లి అతని ఆధార్ కార్డును చెక్ చేయగా, అది నకిలీ అని తేలింది. రెండు వేల రూపాయల కోసం అతడు కిరాయి పెళ్లి కొడుకుగా వచ్చినట్టుగా అంగీకరించాడు. దీంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నకిలీ వరుడిని మంటపం నుంచి తరిమేశారు.
అయితే, ఈ విషయమై జిల్లా ప్రొబేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సామూహిక వివాహానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి పెళ్లికి రాలేదని, అతడి స్థానంలో మరో వ్యక్తి వచ్చారని చెప్పారు. 2000కి కిరాయి వరుడిలా నటిస్తూ మండపానికి వచ్చినట్లుగా తెలిసిందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..