AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ‘మేం కూలిపోతున్నాం’ పైలట్ చివరి మాటలు! 9 మంది మృతి

తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బిజినెస్ జెట్ ఒక్కసారిగా ఆకాశం నుంచి వేగంగా కిందకు దూసుకొచ్చి నేలపై కూలిపోయింది. భారీ శబ్దంతో పేలిపోవడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి.  తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానం కూలిన ప్రదేశం జనావాసాలకు, రద్దీగా ఉండే రహదారికి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘటన  జరిగింది.

Video:  'మేం కూలిపోతున్నాం' పైలట్ చివరి మాటలు! 9 మంది మృతి
Nine Killed As Business Jet Crashes In Florida
Sharada V
|

Updated on: Nov 02, 2026 | 8:27 AM

Share

తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బిజినెస్ జెట్ ఒక్కసారిగా ఆకాశం నుంచి వేగంగా కిందకు దూసుకొచ్చి నేలపై కూలిపోయింది. భారీ శబ్దంతో పేలిపోవడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి.  తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానం కూలిన ప్రదేశం జనావాసాలకు, రద్దీగా ఉండే రహదారికి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘటన  జరిగింది.

‘మేం కూలిపోతున్నాం’ పైలట్ చివరి మాటలు!

విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు ప్రమాద సంకేతాలు పంపించారు. మొదట పరిస్థితి అదుపులోనే ఉందని పైలట్ భావించారు. విమానంపై కొద్దిపాటి మంచు పేరుకుందని, ఓ మోస్తరు గాలి తీవ్రత ఉందని కంట్రోలర్లకు చెప్పారు. అయితే కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్షం, మంచు ప్రభావంతో విమానం ప్రయాణం ప్రమాదకరంగా మారింది. విమానం రెక్కలపై మంచు పేరుకుపోతోందని, తీవ్ర గాలుల కారణంగా విమానం ఒక్కసారిగా పైకి కిందికి కదులుతోందని పైలట్‌ తెలిపారు.

ఆ సమయంలో విమానం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. వాతావరణ పరిస్థితుల కారణంగా మరో 2 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు పైలట్లు అనుమతి కోరారు. కానీ ఆ తర్వాత విమానం అకస్మాత్తుగా వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది.

మొదట నిమిషానికి 10 వేల అడుగుల వేగంతో కిందకు దిగిన విమానం.. ఆ తర్వాత నిమిషానికి 20 వేల అడుగులు, చివరకు 30 వేల అడుగుల వేగంతో కిందకు దూసుకొచ్చినట్లు విమాన ట్రాకింగ్ సమాచారం వెల్లడించింది. విమానం నిర్ణీత వేగ పరిమితిని కూడా దాటిపోయింది.ఈ సమయంలో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి ‘మేడే.. మేడే’ అంటూ సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.

‘మేం నిమిషానికి 10 వేల అడుగుల వేగంతో కిందకు దిగుతున్నాం.. విమానం నియంత్రణ కోల్పోతోంది. మేం నేలను ఢీకొట్టబోతున్నాం’ అంటూ పైలట్ చేసిన చివరి హెచ్చరికలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్స్‌లో వినిపించాయి. కొద్దిసేపటికే విమానం నేలను ఢీకొట్టింది.

మిస్సైల్‌లా దూసుకొచ్చిన విమానం

ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో ఆదివారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లియర్‌జెట్ 60 (Learjet 60)  టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. బహామాస్‌కు వెళ్తుండగా గ్రీన్‌ ఏకర్స్ ప్రాంతంలో ఒక్కసారిగా అదుపుతప్పి కిందకు దూసుకొచ్చింది.

విమానం కూలిపోతున్న దృశ్యాలను రోడ్డుపై ప్రయాణిస్తున్న కొందరు కార్లలో నుంచి వీడియో తీశారు. ఆకాశం నుంచి వేగంగా కిందకు వచ్చిన విమానం రోడ్డుకు సమీపంలో నేలను బలంగా ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయి. విమానం కూలిన ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడగా, చుట్టుపక్కల నల్లటి పొగ కమ్ముకుంది. రోడ్డుపై విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

600 మందిని ఖాళీ చేయించిన అధికారులు

ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. విమానం కూలిన తీరును చూస్తే క్షిపణి వేగంతో నేలపైకి దూసుకొచ్చినట్లు అనిపించిందని, రహదారి పక్కన భారీ గొయ్యి ఏర్పడిందని చెప్పారు. ప్రమాదంలో నేలపై ఉన్నవారికి ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదన్నారు. ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న కాలనీ నుంచి ముందు జాగ్రత్త చర్యగా 600 మందిని అధికారులు ఖాళీ చేయించారు. విమానం కూలిపోవడానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Follow Us