పాముల్లో కింగ్‌కోబ్రాలది ప్రత్యేక స్థానం. ఇతర పాములతో పోల్చుకుంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి. క్షణాల్లోనే మనుషుల ప్రాణాలను తీసేస్తాయి. అందుకే చాలామంది నాగుపాము పేరు వింటేనే వణకు పుడుతుంది. ఇక పొరపాటున కంటికి తారసపడితే క్షణాల్లో అక్కడి నుంచి మాయమవుతారు. అలాంటి భయంకరమైన నాగుపాము ఏకంగా యువకుడి దుప్పట్లో దూరింది. అతి కూడా అర్ధరాత్రి. యువకుడు ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో దుప్పట్లో దూరిన పాము రాత్రంతా అతనితో పాటే నిద్రించింది. కాగా తెల్లారిన తర్వాత పక్కనే ఉన్న పామును చూసి భయంతో వణికిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని సిరోజం గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిరోజం గ్రామానికి చెందిన యువకుడు రాత్రి 10 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించాడు. అయితే కొద్ది సేపటికే ఒక నాగుపాము యువకుడి దగ్గరకు చేరుకుంది. మెల్లగా అతని దుప్పట్లోకి దూరింది.
అయితే సదరు యువకుడు ఆదమర్చి నిద్రపోవడంతో పాము వచ్చిన విషయం గ్రహించలేకపోయాడు. ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు ఆ అబ్బాయికి మెలకువ వచ్చింది. అప్పుడే బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. ఇంకేముంది క్షణాల్లోనే అతని ఫ్యూజులు ఔటయ్యాయి. ఒళ్లంతా చెమటలు పట్టాయి. దెబ్బకు భయంతో బయటకు పరుగులు తీశాడు. వెంటనే స్థానికంగా పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే అతను సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. దుప్పట్లో దూరి కంగారు పెట్టించిన నాగుపామును చాకచక్యంగా పట్టేశాడు. కాగా ఇలాంటి పాములు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయని స్నేక్ క్యాచర్ తెలిపాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..