Watch Video: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయలో మాటలకు అందని ప్రకృతి సౌందర్యం

హిమపాతం, తెల్లని మంచు వర్షం ఎప్పుడూ చూడనివారికి.. ఉష్ణమండలాల్లో నివసించేవారికి కశ్మీర్ వాతావరణం చాలా హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. మంచు కురుస్తూ ఉంటే హాయిగా ఆ మంచు వర్షంలో నడిచి వెళ్లాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రాంతానికి ఎంతో అందాన్ని తెచ్చిపెట్టే ఈ మంచు, అంతే కష్టాన్ని కూడా మోసుకొస్తుంది.

Watch Video: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయలో మాటలకు అందని ప్రకృతి సౌందర్యం
Kashmir Snowfall
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 16, 2023 | 7:14 PM

అసలే కాశ్మీర్ లోయ.. ఆపై ఈ సీజన్లో తొలిసారిగా కురుస్తున్న మంచు.. స్వర్గమే భూమిపైకి దిగి వచ్చిందా అన్నట్టుగా ఉండే ప్రకృతి సోయగం.. ఇప్పుడు కాశ్మీర్ లోయతో పాటు పర్వత ప్రాంతాల్లో కనువిందు చేస్తున్న దృశ్యం. వేర్పాటువాదం అంతగా లేని రోజుల్లో ఇక్కడ షూటింగ్ జరపని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. 80వ దశకం నుంచి 90వ దశకం ప్రారంభం వరకు తెలుగు సినిమా యుగళ గీతాలకు కాశ్మీర్ లోయ చిరునామాగా ఉండేది. ఆ తర్వాత వేర్పాటువాదం పెరిగినప్పటికీ.. అడపా దడపా అనేక సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకుంటూనే ఉన్నాయి. ఇక పర్యాటక రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోయ మొత్తం మంచు దుప్పటి కప్పుకునే వరకు పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి మొదలయ్యే హిమపాతం ఏప్రిల్ నెలవరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వేసవి మొదలయ్యాక మంచుదుప్పటి నుంచి బయటపడి పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఆహ్లాదాన్ని కల్గిస్తుంది.

అందమే కాదు.. కష్టమూ ఉంది

హిమపాతం, తెల్లని మంచు వర్షం ఎప్పుడూ చూడనివారికి.. ఉష్ణమండలాల్లో నివసించేవారికి కశ్మీర్ వాతావరణం చాలా హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. మంచు కురుస్తూ ఉంటే హాయిగా ఆ మంచు వర్షంలో నడిచి వెళ్లాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రాంతానికి ఎంతో అందాన్ని తెచ్చిపెట్టే ఈ మంచు, అంతే కష్టాన్ని కూడా మోసుకొస్తుంది. అందులో మొదటిది చలి తీవ్రత పెరగడం. రెండోది మంచుతో రహదారులన్నీ మూసుకుపోయి రవాణా వ్యవస్థ నిలిచిపోవడం. మంచును తొలగించే వరకు వాహనాల రాకపోకలు సాగించడానికి కూడా వీలుండదు. ప్రస్తుతం కురుస్తున్న మంచు కారణంగా జమ్ము-కశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలను కలిపే పలు ప్రధాన రహదారులు మంచుతో నిండిపోయాయి.

ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల మధ్య కొలువైన కశ్మీర్ లోయతో పాటు ఇతర ప్రాంతాలను బయటి ప్రపంచంతో అనుసంధానం చేసే కనుమ (పాస్)లు ఈ హిమపాతం కారణంగా మంచుతో నిండిపోయి రాకపోకలకు ఆస్కారం లేకుండా చేస్తాయి. ఈ క్రమంలో తాజా మంచు వర్షం కారణంగా రజ్దాన్ పాస్, జోజిలా పాస్, సింథాన్ టాప్, కిష్త్వార్‌తో సహా లోయలోని ఎత్తైన ప్రాంతాలు మంచుతో నిండిపోగా.. లోయల్లో వర్షం కురుస్తోంది. మంచు కారణంగా శ్రీనగర్ (కశ్మీర్ లోయ) – లేహ్ (లద్దాఖ్)ని అనుసంధానం చేసే జోజిలా పాస్ పూర్తిగా మంచుతో నిండిపోయింది. సాధారణంగా 5-6 నెలల పాటు మంచు కారణంగా ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపోతాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు, ఏడాది పొడవునా రాకపోకలు సాగించడం కోసం 14.2 కి.మీ పొడవైన టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ఈ టన్నెల్ పనులను చేపట్టి, రికార్డ్ వేగంతో నిర్మాణం చేస్తోంది. ఇది పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద బై-డైరెక్షనల్ టన్నెల్‌గా రికార్డుల్లోకి ఎక్కుతుంది. ఇది సముద్రమట్టానికి 3,528 మీటర్ల ఎత్తున.. అంటే నిలువుగా 3.5 కి.మీ ఎత్తైన ప్రాంతంలో నిర్మాణం జరుపుకుంటోంది.

హిమాచల్ ప్రదేశ్‌లో లాహౌల్-స్పితి లోయను మిగతా ప్రపంచంతో అనుసంధానం చేసే రోహ్‌తంగ్ పాస్ వద్ద నిర్మించిన 9.02 కి.మీ అటల్ టన్నెల్‌ను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ తరహా టన్నెల్స్ నిర్మాణం లేకపోతే.. ఎత్తైన హిమశిఖరాల మీదుగా రోడ్డు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. శీతాకాలంలో కురిసే మంచు కొన్ని మీటర్ల మందం పేరుకుపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోతుంటాయి. అందుకే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో హిమశిఖరాలను తొలుస్తూ సొరంగ మార్గాలు నిర్మిస్తోంది. ఇలాంటి సొరంగ మార్గాలు అందుబాటులోకి వచ్చే వరకు కశ్మీర్ లోయ సహా జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు హిమపాతంతో కష్టాలు తప్పవు.

వాతావరణ శాఖ రానున్న కొద్ది రోజుల పాటు జమ్మూ-కాశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుందని, మిగతా లోయ ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని సూచిస్తోంది.