VIRAL VIDEO : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిత్యం వాహనదారులను అప్రమత్తం చేస్తూనే ఉంటారు. రోడ్డుపై వెళుతున్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని హెచ్చరిస్తారు. పలు మీమ్స్‌తో పాటు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలర్ట్ చేస్తూ ఉంటారు. తరచూ రోడ్డు సేఫ్టీ ఎంత ముఖ్యమో గుర్తు చేస్తారు. అయినప్పటికీ కొంతమంది డ్రంకెన్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన తర్వాత గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను పక్కన వెళ్లే పాదాచారులు, వాహనదారులు ఎవ్వరు పట్టించుకోవడంలేదు. దీంతో వారు అక్కడే ప్రాణాలు విడుస్తున్నారు.
తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో మానవత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉంది. తుర్కపల్లి, శామీర్పేట్ వద్ద ఒక ద్విచక్ర వాహనదారుడు వేగంగా వచ్చి కంట్రోల్ కాక ముందు వెళుతున్న లారీ ని ఢీ కొట్టాడు. తీవ్రగాయాలతో అక్కడే రోడ్డు పై పడిపోయాడు. చాలాసేపు మెయిన్ రోడ్డుపైనే గాయాలతో కొట్టుమిట్టాడుతుంటాడు. అక్కడికి కొద్ది దూరంలో కొంతమంది వ్యక్తులు ఈ ప్రమాదాన్ని చూస్తారు కానీ ఆ వ్యక్తిని కాపాడటానికి ఒక్కరు కూడా ముందుకు రారు. కనీసం రోడ్డు పక్కకు తీసుకురావడానికి కూడా ప్రయత్నించరు. అంబులెన్స్‌కి ఫోన్ చేద్దామన్నా ధ్యాసకూడా లేకుండా ప్రవర్తిస్తారు. దీంతో ఆ యువకుడు రోడ్డుపైనే ఉండటంతో ఒకటి రెండు వాహనాలు అతడి పక్కనుంచి వెళ్లాయి కానీ ఒక కారు వేగంగా వచ్చి అతడి పై నుంచి వెళ్లింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు.
పక్కన ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కి ఫోన్ చేసినా కనీసం ఆ వ్యక్తిని పక్కకు జరిపినా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ప్రమాదాన్ని చూస్తూ మానవత్వం మరిచి ప్రవర్తించడంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసాయి. ఈ వీడియోను షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దయచేసి ప్రమాదంలో గాయపడినవారిని కాపాడండని పిలుపునిచ్చారు. అలా చేయడం వల్ల ఆ వ్యక్తిని మాత్రమే కాకుండా ఓ కుటుంబాన్ని నిలబెట్టినవారవుతారని సూచించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి చట్ట పరమైన రక్షణ ఉంటుంది. అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. ఇతరుల పట్ల మానవత్వంతో ప్రవర్తించడని కోరారు.