
హర్యానాలోని గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు 22వ అంతస్తులోని ఫ్లాట్ నుంచి కింద పడి మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ఫ్లాట్ తలుపులు మూసుకుపోవడంతో భయపడిపోయిన బాలుడు బాల్కనీ ఎక్కి సాయం అర్థించే క్రమంలో పట్టుతప్పి కిందపడి మరణించాడు. ఈ విషాద సంఘటన శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సెక్టార్ 62లోని పయనీర్ ప్రెసిడియా హౌసింగ్ సొసైటీలో జరిగింది.
రుద్ర తేజ్ సింగ్ అనే ఆ చిన్నారి ఆడుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతనితో పాటు ఒక పనిమనిషి కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. బాలుడి తల్లిదండ్రులు తండ్రి ప్రకాశ్ చంద్ర బిల్డర్, తల్లి ఒక డాక్టర్ కావటంతో ఇద్దరూ తమ పనుల్లో బయటకు వెళ్లిపోయారు. బాలుడిని చూసుకునేందుకు పని మనిషిని నియమించారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు రుద్రతేజ్ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్ర లిఫ్ట్ నుంచి బయటకు రాగానే ఫ్లాట్‌లోకి పరిగెత్తాడు. ఆటో-లాక్ సిస్టమ్ ఉన్న మెయిన్ డోర్ అతని వెనుక మూసుకుపోయింది. ఇంటి పనిమనిషి బయట లాక్ చేయబడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉండిపోయిన పిల్లవాడు భయంతో వణికిపోయాడు. ఆ పిల్లవాడు బాల్కనీకి వెళ్లి సహాయం కోసం పిలుస్తూ బట్టలు ఆరేసుకును రాడ్ పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు..ఈ క్రమంలోనే కిందపడి మరణించాడు.
తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం అయిన రుద్రతేజ్ దుర్మరణం ఆ తల్లిదండ్రులను బతికి ఉన్న శవాలుగా మార్చేసింది. బాలుడు బ్యాలెన్స్ తప్పి 22వ అంతస్తు నుంచి కిందపడిపోవడంతో స్థానికులు బాలుడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం తర్వాత చిన్నారి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..