పెద్ద ఇళ్లు.. ఇంటి ముందు లగ్జరీ కార్లు! కానీ, లోపల యవ్వరం వేరే! పోలీసులకు డౌట్ వచ్చి వెళ్లి చూడగా..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని విలాసవంతమైన ఇంటిని నకిలీ 'వెస్టార్కిటికా' రాయబార కార్యాలయంగా మార్చి, ఖరీదైన కార్లు, నకిలీ పాస్‌పోర్టులు, నగదుతో నడుపుతున్న గుట్టురట్టు అయింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాన్ని ఛేదించి, హరవర్ధన్ జైన్ అనే వ్యక్తి ని అరెస్టు చేశారు.

ఇంద్ర భవనం లాంటి పెద్ద బంగ్లా.. దాని ముందు లగ్జరీ కార్లు. చూడగానే ఎవరిదో బాగా డబ్బున్న వ్యక్తి ఇళ్లో, లేదంటే ఓ పెద్ద ఆఫీసో అని అనుకునేలా ఉంది. కానీ, లోపల జరిగే తతంగం అంతా వేరే. టాస్క్ ఫోర్స్ అధికారులు వెళ్లి చూడగా అసలు బండారం అంతా బయటపడింది. పూర్తి వివరాల్లో వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ పెద్ద ఇంటి ముందు ఎంబసీ నంబర్ ప్లేట్లతో కూడిన ఖరీదైన కార్లు ఉన్నాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులకు అనుమానం వచ్చి వెళ్లి తనిఖీ చేయగా నకిలీ రాయబార కార్యాలయ గుట్టురట్టయింది.
విలాసవంతమైన రెండంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని, ఏ దేశం అధికారకంగా గుర్తించని చిన్న దేశమైన ‘వెస్టార్క్టికా’ రాయబార కార్యాలయంగా నడిపిస్తున్నారు. దీని సృష్టికర్త అయిన హరవర్ధన్ జైన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల్లో పని ఇప్పిస్తామని ప్రజలను ఆకర్షించడానికి ఉద్యోగ రాకెట్టును నడుపుతున్నాడని, మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లో భాగమని కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. జైన్ తనను తాను వెస్టార్కిటికా ‘బారన్’గా పరిచయం చేసుకుని, దౌత్య నంబర్ ప్లేట్లు కలిగిన ఖరీదైన కార్లలో ప్రయాణిస్తాడని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత వర్గాలలో ఆదరణ పొందేందుకు అతను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులతో మార్ఫింగ్ చేసిన చిత్రాలను తన ఆఫీస్‌లో పెట్టుకున్నాడు. అలాగే వాటిని ప్రచారం చేశాడు. వాస్తవానికి 2011లో జైన్‌పై చట్టవిరుద్ధంగా శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నందుకు కేసు నమోదైంది.
ఈ నకిలీ రాయబార కార్యాలయంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దౌత్య నంబర్ ప్లేట్లు కలిగిన నాలుగు హై-ఎండ్ కార్లు, 12 మైక్రోనేషన్ల ‘దౌత్య పాస్‌పోర్ట్‌లు’, విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టాంపులు కలిగిన పత్రాలు, 34 దేశాల స్టాంపులు, రూ.44 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, 18 దౌత్య నంబర్ ప్లేట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
వెస్టార్కిటికా అంటే ఏమిటి?
US నేవీలో అధికారి అయిన ట్రావిస్ మెక్‌హెన్రీ 2001లో ‘వెస్టార్కిటికా’ను స్థాపించారు. తరువాత తనను తాను దాని గ్రాండ్ డ్యూక్‌గా నియమించుకున్నారు. అంటార్కిటికాలో ఉన్న వెస్టార్కిటికా 620,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. మెక్‌హెన్రీ తనను తాను పాలకుడిగా నియమించుకోవడానికి అంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థలోని లొసుగును ఉపయోగించారు. ఈ ఒప్పందం దేశాలు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలపై దావా వేయడాన్ని నిషేధిస్తున్నప్పటికీ, ఇది ప్రైవేట్ వ్యక్తుల గురించి ఏమీ చెప్పలేదు. వెస్టార్కిటికా తనకు 2,356 మంది పౌరులు ఉన్నారని పేర్కొంది. వారిలో ఎవరూ అక్కడ నివసించరు. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న గ్రాండ్ డచీ ఆఫ్ వెస్టార్కిటికా వాతావరణ మార్పు, అంటార్కిటికా గురించి అవగాహన కల్పించే లాభాపేక్షలేని సంస్థగా పనిచేస్తుంది. దీనికి దాని స్వంత జెండా, కరెన్సీ ఉంది. ఏ ప్రభుత్వం గుర్తించని బిరుదులను కూడా జారీ చేస్తుంది.
ఆసక్తికరంగా యూపీ ఎస్టీఎఫ్ నకిలీ రాయబార కార్యాలయాన్ని ఛేదించడానికి కొన్ని రోజుల ముందు, వెస్టార్క్టికా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ దాని “న్యూఢిల్లీలోని కాన్సులేట్ జనరల్” ఫోటోలను పోస్ట్ చేశారు. “బారన్ హెచ్.వి. జైన్ నిర్వహణలో, న్యూఢిల్లీలోని వెస్టార్కిటికా కాన్సులేట్ జనరల్ 2017 నుండి పనిచేస్తోంది. భారతదేశంలో వెస్టార్కిటికా ప్రయోజనాలను సూచించడంతో పాటు, బారన్ జైన్ స్థానిక జనాభాకు సంవత్సరానికి 5 సార్లు ఆహారాన్ని పంపిణీ చేస్తారు, అవసరమైన 1,000 మందికి పైగా సేవ చేస్తారు” అని పేర్కొంటూ ఘజియాబాద్‌లోని ఖరీదైన భవనం, జైన్ నిర్వహించిన ‘భండారా’ ఫోటోలను షేర్ చేశారు. వెస్టార్కిటికా ఒక్కటే కాదు. ప్రపంచవ్యాప్తంగా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకునే అనేక సూక్ష్మదేశాలు ఉన్నాయి, కానీ ఏ దేశం కూడా వాటిని గుర్తించలేదు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
