పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, హరిన్‌ఘర్ క్యాంపస్‌లోని తరగతి గదిలో ఒక వివాహ వేడుక జరిగింది. సరే పెళ్లే కదా జరిగింది అని అలా తేలిగ్గా తీసిపారేస్తే అక్కడే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ఆ పెళ్లి జరిగింది ఒక విద్యార్థికి, ఒక హెడ్ టీచర్‌కి. ఏంటి.. షాకయ్యారా.? అవును నిజం.! మొదటి సంవత్సరం విద్యార్థిని డిపార్ట్‌మెంట్ హెడ్ టీచర్ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ విచిత్రమైన పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పెళ్లికి ఇద్దరు సాక్షుల సంతకాలతో పాటు యూనివర్సిటీ ప్యాడ్‌పై భార్యాభర్తల లిఖితపూర్వక ఒప్పందం కూడా ఉండడం గమనార్హం. పెళ్లి తంతులో భాగంగా టీచర్ వధువుగా అలంకరించుకుని అందంగా ముస్తాబై హిందూ సంప్రదాయం ప్రకారం పూర్తి ఆచారాలను కూడా పాటించినట్లు తెలుస్తోంది. పెళ్లికి వారే కాదు.. అక్కడ చదువుకునే విద్యార్థులు, చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. ఆపై ఆ విద్యార్థి తనకు కాబోయే భార్య అయిన ఆ హెడ్ టీచర్ నుదిటిపై సింధూరం పూశాడు. మోకాళ్లపై కూర్చుని ఓ గులాబీ పువ్వును ఆ వధువుకు అందిస్తూ మురిసిపోతుండగా.. అది అందుకుంటూ ఆ హెడ్ టీచర్ పెళ్లి కళతో సిగ్గులుపోయింది.
అయితే ఇదంతా చూసి వారిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారని అనుకుంటే పొరపాటే. ఇది ఓ ప్రాజెక్ట్‌లో భాగమైన సైకలాజికల్ డ్రామా అని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. నాటక రూపంలో పిల్లలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలా తమాషాగా చేశామని.. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఆ డ్రామాలోని ఓ పార్ట్ మాత్రమే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారన్నారు సదరు మహిళా టీచర్. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని.. ఆమె మీడియాతో చెప్పారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. సదరు హెచ్‌వోడీని పదవి నుంచి తొలగించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి