AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష

ఒక సోషల్ మీడియా కామెంట్ ఓ యువ ఇంజినీర్ జీవితాన్ని మలుపు తిప్పింది. మొదట ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కుటుంబం అప్పీలుకు ప్రయత్నించింది. అంతలోనే ఐదేళ్ల జైలు శిక్ష కాస్తా మరణశిక్షగా మారింది. ప్రవక్త మహమ్మద్‌పై అవమానకర వ్యాఖ్య చేశారనే ఆరోపణలతో సౌదీ అరేబియాలో 24 ఏళ్ల శ్రీలంక ఇంజినీర్ అనోజన్ శివరాసాకు మరణశిక్ష విధించారు. వేల కిలోమీటర్ల దూరంలో శ్రీలంకలో ఉన్న కుటుంబం ఇప్పుడు న్యాయపోరాటం చేస్తోంది.

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష
Facebook Comment To Death Penalty For A Sri Lankan Engineer In Saudi Arabia
Sharada V
|

Updated on: Oct 08, 2026 | 12:14 AM

Share

2025 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియా వెళ్లిన అనోజన్ శివరాసా ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో టెక్నికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ ఏడాదే అతనికి పెళ్లి చేయాలని కుటుంబం భావించింది. కానీ ఓ సోషల్ మీడియా కామెంట్ అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అనోజన్ శ్రీలంకలో ఉన్న సమయంలో శ్రీలంకలో ఓ వీడియో వైరల్ అయింది.  ఓ వ్యక్తి హిందూ దేవతపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో.. దానికి ప్రతిస్పందిస్తూ అనోజన్ ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలు చేసారు. తర్వాత ఆ కామెంట్‌ను అనోజన్ తొలగించి, క్షమాపణలు కూడా చెప్పారని అతని సోదరుడు హంసిదన్ శివరాసా తెలిపారు. అయితే అప్పటికే ఆ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కొందరు సౌదీలో అతను పనిచేస్తున్న సంస్థ యాజమాన్యానికి పంపించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఐదేళ్ల శిక్ష.. ఒక్కసారిగా మరణశిక్ష!

సౌదీలో అనోజన్ ఫోన్, కంప్యూటర్‌ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా సైబర్ క్రైమ్ చట్టం కింద అనోజన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు.. దాదాపు మూడు మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా విధించింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.7.7 కోట్లు. అనోజన్ కుటుంబం శిక్షను తగ్గించాలని అప్పీల్ చేయగా సౌదీ ప్రాసిక్యూటర్లు మరో అభ్యర్థన చేసారు. ఈ కేసును కేవలం సైబర్ క్రైమ్ చట్టం కింద కాకుండా.. షరియా చట్టం ప్రకారం విచారించాలని కోరారు. అప్పీలేట్ కోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించడంతో 2026 సెప్టెంబర్ 17న అనోజన్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

తల్లిదండ్రులను కలిసిన శ్రీలంక అధ్యక్షుడు

ఈ వ్యవహారం శ్రీలంకలో కలకలం రేపింది. అనోజన్‌ను కాపాడాలంటూ పౌర సంఘాలు నిరసనలు  దిగాయి. సౌదీ అధికారులతో దౌత్య మార్గాల్లో సంప్రదించాలని శ్రీలంక అధ్యక్షుడు ఆదేశించారు.కేసులో న్యాయపరమైన అవకాశాలను పరిశీలించేందుకు శ్రీలంకకు చెందిన నలుగురు సభ్యుల న్యాయ బృందం సౌదీ అరేబియాకు వెళ్లింది. అనోజన్ తరఫున అక్కడి స్థానిక న్యాయవాదులను కలిసి.. మరణశిక్షను తగ్గించేలా, తీర్పుపై అప్పీల్ చేసే మార్గాలను పరిశీలిస్తోంది. అనోజన్ కేసు ఒక వ్యక్తికి సంబంధించిన న్యాయపోరాటంగా కాకుండా.. విదేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల భద్రత పై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Follow Us