Viral News: బ్రతికుండగానే చావు భయం.. దీన్ని జయిస్తే ఇక మీకు తిరుగులేనట్టే.. ఏంటో తెలుసా?
మీరు బ్రతికి ఉండగానే.. మిమ్మల్ని ఒక చీకటి గదిలో సెవపేటికలో పెట్టి మూసేస్తే.. అప్పుడు మీకేమనిపిస్తుంది. ఒక్కసారిగా ఊరిరాడిపోయిన అనుభవం కలుగుంది. చావు భయం ఒక్కక్షణం మన కళ్లముందు కనిపిస్తోంది. వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటకురావాలి అనిపిస్తోంది కదా.. కానీ ఇదే ఇప్పుడు జపాన్‌లో ట్రెండ్‌గా కొనసాగుతుంది. అక్కడి ప్రజలు బతికుండగానే ఆ శవపేటికలో పడుకుని, మరణాన్ని అనుభవపూర్వకంగా చూడాలనుకుంటున్నారు.

జపాన్ దేశం ఎప్పుడూ తన వినూత్న ఆలోచనలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా అక్కడ ప్రాచుర్యం పొందుతున్న కాఫిన్ థెరపీ అంటే శవపేటిక చికిత్స ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే శవపేటికను ఉపయోగిస్తారన్నది జగమెరిగిన సత్యం. కానీ జపాన్ ప్రజలు మాత్రం బతికుండగానే ఆ శవపేటికలో పడుకుని, మరణాన్ని అనుభవపూర్వకంగా చూడాలనుకుంటున్నారు. టోక్యోలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఒక చీకటి గదిలో పువ్వులతో అలంకరించిన శవపేటికలో వారు పడుకోగానే.. నిర్వాహకులు దాని మూతను గట్టిగా మూసివేస్తారు. సుమారు 30 నిమిషాల పాటు ఆ గాఢాంధకారంలో నిశ్శబ్ద వాతావరణంలో గడపడం వల్ల మనిషికి తన అంతరాత్మతో మాట్లాడే అవకాశం లభిస్తుందని.. జీవితంలోని అనవసరపు ఆందోళనలు తొలగిపోతాయని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు.
సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, జపాన్ సమాజంలో ఒంటరితనం, పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ వింత ట్రెండ్ ఒక మందులా పనిచేస్తోందని స్థానికులు భావిస్తున్నారు. శవపేటికలో ఉన్న ఆ అరగంట సమయంలో.. నేను నిజంగా చనిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి? నేను సాధించాల్సింది ఇంకా ఏముంది? అనే ప్రశ్నలు వారిలో ఉదయిస్తున్నాయని, ఇది వారిని మరింత బాధ్యతాయుతంగా మారుస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ ప్రక్రియ కేవలం భయపెట్టడానికి కాదు.. మరణం అనేది ఎంత అనివార్యమో గుర్తు చేస్తూ.. మన దగ్గర ఉన్న సమయాన్ని ఎంత విలువైనదిగా మార్చుకోవాలో నేర్పడానికి అని వారు నమ్ముతున్నారు. శవపేటిక నుంచి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి మొహంలో ఒక తెలియని ప్రశాంతత, మళ్ళీ పుట్టినట్లుగా ఉండే ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుండటం విశేషం.
ఈ వింత ఆచారంపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. జపాన్ యువత మాత్రం దీనికి జై కొడుతోంది. సాధారణంగా మరణం అంటే భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని గెలవడమే ఈ థెరపీ ప్రధాన లక్ష్యం. మరణాన్ని స్మరించుకోవడం అంటే జీవితాన్ని ప్రేమించడమే.. అనే ప్రాచీన సూత్రాన్ని వీరు పాటిస్తున్నారు. భారీగా పెరిగిన ఆత్మహత్యల రేటును తగ్గించడానికి, మానసిక దృఢత్వాన్ని పెంచడానికి ఇలాంటి ప్రయోగాలు ఉపయోగపడతాయని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే మరణం యొక్క నిశ్శబ్దాన్ని రుచి చూసిన వారు.. జీవితంలోని కోలాహలాన్ని మరింత ఆనందంగా స్వీకరిస్తారని ఈ కాఫిన్ ట్రెండ్ నిరూపిస్తోంది. మరణపు అంచు దాకా వెళ్లి తిరిగి రావడం అంటే అది నిజంగా ఒక సాహసమే మరి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
