Viral: 5 రోజులుగా తినడం, తాగడం ఆపేసిన గర్భిణీ ఆవు.. పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లగా..
ఆ ఆవు కడుపుతో ఉంది. అయితే ఏమయిందో ఏమో కానీ.. నాలుగైదు రోజులుగా స్థానికులు ఏం పెట్టినా తినడం లేదు. కనీసం నీళ్లు కూడా తాగడం లేదు. రోజురోజుకు అది నీరసించిపోవడంతో కంగారు పడిన స్థానికులు.. దగ్గర్లోని పశువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.. అక్కడ...

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. గర్భిణీ ఆవు కడుపులోంచి 28 కిలోల ప్లాస్టిక్, దుస్తులు, తాళ్లు, అలాగే 41 మేకులు సహా వివిధ రకాల వస్తువులు వైద్యులు తొలగించారు. ఈ ఆపరేషన్‌ను శనివారం బర్నోహ్‌లోని జోనల్ వెటర్నరీ హాస్పిటల్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ నిశాంత్ రనౌత్ నేతృత్వంలోని డాక్టర్ల టీం విజయవంతంగా నిర్వహించింది.
గత 4-5 రోజులుగా ఆవు తినడం, నీరు తాగడం మానేయడంతో.. స్థానికుడు విపిన్ కుమార్, ఇతర గ్రామస్థులు దానిని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మొదట సాధారణ పరీక్షల్లోనే కడుపులో అసహజమైన వస్తువులు ఉన్నట్లు అక్కడి వైద్యులకు అనుమానం వచ్చింది. టెస్టులు చేసిన తర్వాత శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించినట్లు డాక్టర్ రనౌత్ తెలిపారు.
ఆపై ఆపరేషన్ చేసి.. ఆవుకు కడుపు నుంచి 28 కిలోల ప్లాస్టిక్, దుస్తులు, తాళ్లు, వివిధ రకాల మెటల్ ముక్కలు, 41 మేకులు తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం ఆవును 7 రోజులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించనున్నారు.
“ఇప్పటి వరకు మా ఆసుపత్రిలో 53 క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించాం. పెద్ద జంతువుల చికిత్సకు కావాల్సిన అన్ని ఆధునిక సదుపాయాలు, రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఈ ఆసుపత్రి ఈ ప్రాంతంలో పెద్ద జంతువుల చికిత్సకు ముఖ్య కేంద్రంగా మారింది” అని డాక్టర్ రనౌత్ అన్నారు.
“ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలు, మేకులు వంటి చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేయకండి. ఇలా చేస్తే జంతువుల ప్రాణాలు కాపాడటం మాత్రమే కాకుండా పర్యావరణం కూడా మేలు జరుగుతుంది” అని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుడు డాక్టర్ వీరేంద్ర పాటియాల్ చెప్పారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
