తుఫాన్ ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాల్లో జన్మించిన 1900 మంది శిశువులు.. “దానా”గా నామకరణం..!
కష్టకాలంలోనే రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు 1900 మంది పిల్లలు పుట్టారు. వీరిలో కొంత మంది తమ పిల్లలకు ఇదే పేరును పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారు. దానా పేరు పెట్టడం తమకు సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
దానా తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒకవైపు ఇరు రాష్ట్రాల ప్రజలు వందల సంఖ్యలో నిరాశ్రయులుగా మారారు. సొంత ఊరు, ఉంటున్న ఇళ్లు వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ బతికి ఉంటే చాలునని అనేక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి కష్టకాలంలోనే రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు 1900 మంది పిల్లలు పుట్టారు. ఒక్క ఒడిశాలోనే 1600 మంది నవజాత శిశువులు జన్మించారు. అయితే, వారిలో చాలా మంది చిన్నారులకు తుఫాను పేరిట నామకరణం చేశారు. అంతేకాదు.. తుఫాన్లు, అల్పపీడన ప్రభావంతోనే ఎక్కువ మంది గర్భిణీలు ప్రసవించినట్టుగా చెబుతున్నారు.. ఆ వివరాలేంటో పూర్తి డిటెల్స్‌కి వెళితే..
నివేదికల ప్రకారం.. ఒరిస్సా లో దానా తుపాను బీభత్సం సృష్టించింది. కానీ దానా తుపాను తీవ్రత సమయంలో రాష్ట్రంలో 1600 మంది శిశువులు జన్మించారు. వీరిలో కొందరికి దానాగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఒరిస్సా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒడిశాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 1,600 మందికి పైగా మహిళలు 16 కవలలతో సహా శిశువులకు జన్మనిచ్చారు. బెంగాల్‌లో 392 మంది పిల్లలు జన్మించారు. తుపాను తాకిడికి ముందు 4,000 మందికి పైగా గర్భిణులను ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్లు ఒడిశా సీఎం మోహన్ మాఝీ తెలిపారు.
బెంగాల్‌లోని దక్షిణ 24-పరగణాలు, పశ్చిమ మిడ్నాపూర్‌లో 392 నవజాత శిశువులు జన్మించారు. వీరిలో కొంత మంది తమ పిల్లలకు ఇదే పేరును పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారు. దానా పేరు పెట్టడం తమకు సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే, తుఫానుల సమయంలో ఎక్కువ మంది పిల్లలు పుట్టారా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. తుఫానులు గర్భిణీ స్త్రీలను నిజంగా ప్రభావితం చేస్తాయా..? అనే చర్చ కూడా మొదలైంది.
తుపాను పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఆయా ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇది గర్భిణీలను ప్రభావితం చేస్తుందని, జననాల రేటు పెరుగుదలకు కారణమవుతుందని పేర్కొన్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ప్రసవానికి, అల్పపీడనానికి మధ్య సంబంధం కనుగొనబడింది. తుఫాను, దాని సంబంధిత ఒత్తిడి కారణంగా ప్రసవ నొప్పి మొదలవుతుందని కూడా కొందరు అంటున్నారు. అయితే, ఇలాంటి వాదనలు కేవలం అపోహ మాత్రమేనని, వాటికి నిజంతో సంబంధం లేదని కూడా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి శాస్త్రీయ నివేదిక ఇంకా వెలుగులోకి రాలేదు. కాబట్టి ఇది నిజం అని భావించలేము అంటున్నారు చాలా మంది విశ్లేషకులు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..