Video: వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే ఎలా పట్టుకున్నాడో చూడండి.. వీడియో వైరల్..
సినిమాల్లో సూపర్ హీరోలు పైనుంచి పడిపోయేవాళ్లను గాల్లోనే క్యాచ్ పట్టి కాపాడటం చూసుంటారు. కానీ లండన్ వీధుల్లో సరిగ్గా అలాంటి సీనే రిపీట్ అయింది. కాకపోతే అక్కడ ఉన్నది సినిమా హీరో కాదు.. మన ఇండియాకు చెందిన ఒక సాధారణ వ్యక్తి. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న మూడేళ్ల చిన్నారిని గాల్లోనే క్యాచ్ పట్టి ప్రాణాలు కాపాడాడు.

సినిమాను తలపించేలా జరిగిన ఓ ఘోర ప్రమాదం.. ఒక భారతీయుడి సమయస్ఫూర్తి, ప్రాణాలకు తెగించిన సాహసం వల్ల సుఖాంతమైంది. లండన్‌లోని ఇల్‌ఫోర్డ్ హైరోడ్డులో ఒక భవనం పైనుంచి కిందపడిపోతున్న మూడేళ్ల చిన్నారిని, ఒక భారతీయ యువకుడు పోలీస్ కానిస్టేబుల్‌తో కలిసి అద్భుతంగా క్యాచ్ పట్టి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లండన్‌లోని ఇల్‌ఫోర్డ్‌లో ఓ పాన్‌బ్రోకర్ షాప్ పైనున్న ఫ్లాట్ కిటికీ సజ్జపైకి ఒక మూడేళ్ల చిన్నారి ఎలాగోలా చేరుకుంది. అక్కడ పట్టుతప్పి కింద పడిపోయే స్థితిలో.. దాదాపు తొమ్మిది నిమిషాల పాటు ఆ చిన్నారి ఆ కిటికీ అంచును పట్టుకుని వేలాడుతూ కనిపించింది. కింద ఉన్న జనం భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని, ఒక ఆఫీసర్ ఆ చిన్నారి కింద ఉన్న సజ్జపైకి ఎక్కినా.. ఆ పాపను అందుకోవడం సాధ్యం కాలేదు.
రంగంలోకి దిగిన భారతీయ తండ్రి..
ఆ సమయంలో అక్కడే నివసిస్తున్న భారతీయ రెస్టారెంట్ మేనేజర్ మహ్మద్ జెసిల్ ఆ దృశ్యాన్ని చూశాడు. ఐదు నెలల కవల పిల్లలకు తండ్రి అయిన జెసిల్.. ఒక తండ్రిగా ఆ పాపను చూసి తట్టుకోలేకపోయాడు. ఏమాత్రం ఆలోచించకుండా, ప్రాణాలకు తెగించి బిల్డింగ్ పైకి పరుగెత్తాడు. ఆ పాప పట్టు సడలిపోతున్న క్షణంలో.. జెసిల్, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ సరిగ్గా ఆ చిన్నారి కింద పొజిషన్ తీసుకుని.. పడిపోతున్న పాపను పట్టుకున్నారు. పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్ వారిద్దరూ కిందపడకుండా బ్యాలెన్స్ చేశాడు. దీంతో ఆ చిన్నారికి చిన్న గీత కూడా పడకుండా ప్రాణాలు దక్కాయి. ఆ వెంటనే ఆ పాప జెసిల్‌ను గట్టిగా హగ్ చేసుకుంది.
ఇండియాలో ఆడిన క్రికెట్టే కాపాడింది..
ఈ అద్భుతమైన రెస్క్యూ తర్వాత జెసిల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘నేను ఇండియాలో ఉన్నప్పుడు బాగా క్రికెట్ ఆడేవాడిని. బహుశా ఆ క్రికెట్ క్యాచ్‌ల అనుభవమే ఇప్పుడు ఆ పాపను క్యాచ్ పట్టడానికి, నాలో ఏకాగ్రత పెంచడానికి సహాయపడి ఉండవచ్చు. నేనేం హీరోని కాదు, ఒక తండ్రిగా నా బాధ్యతను మాత్రమే నెరవేర్చాను’’ అంటూ వినయంగా చెప్పుకొచ్చాడు.
మా పాలిట దేవుళ్లు అంటూ తండ్రి భావోద్వేగం
తన కూతురును కాపాడిన పోలీస్ ఆఫీసర్‌ను, జెసిల్‌ను ఆ పాప తండ్రి రియల్ హీరోస్ అంటూ కొనియాడాడు. ‘‘వారిద్దరూ మా పాలిట దేవుళ్లు. నా బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాం’’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ రెస్క్యూకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లు మన భారతీయ యువకుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
A girl was saved after falling from a window ledge in London. Video shows a restaurant manager joining a police officer as they both caught the girl after she lost her grip.. pic.twitter.com/5j43xgMesy
— 𝒲𝒾𝓁𝓁𝑜𝓌 𝒲𝒽𝒾𝓂𝓈𝓎 (@willow_wwhimsy) June 12, 2026
