Viral Video: అడవిలో పోరాటం ఇట్టా ఉంటది.. మొదటి సీన్ ఇది.. అంతిమంగా..
బోట్స్వానాలోని ఛోబే పార్క్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన అటవీ ప్రపంచంలో సర్వైవల్ కోసం జరిగే పోరాటన్ని తెలియజేసింది. రోసెలైన్ కెర్జోసే ఈ వీడియోను రికార్డు చేశారు. అరుదైన జీవుల పోరాటం ఇందులో కెమెరా కంటికి చిక్కింది. ఒక కొండచిలవ.. తొలుత ఓ హనీ బ్యాడ్జెర్‌ను చుట్టేయగా, ఇంతలో ఒక నక్క అక్కడికి వచ్చింది. ఆ తర్వాత మరో నక్క కూడా జోక్యం చేసుకుంది. ఆహారం కోసం జరిగిన ఈ త్రిముఖ పోరాటంలో చివరికి ఎవరు నెగ్గారు..?

బోట్స్వానాలోని ఛోబే పార్క్‌లో చాలా ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఓ ఘటన తాలూకా వీడియో తాజాగా వైరల్ అవుతోంది. రోసెలైన్ కెర్జోసే అనే 60 ఏళ్ల మహిళా టూరిస్ట్.. అద్భుతమైన అటవీ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఒక భారీ కొండచిలువ.. హనీ బ్యాడ్జర్‌ను పూర్తిగా చుట్టేసి, దాని ప్రాణాలను తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ పోరాటం మొదలైంది. ఈ సమయంలో కొండచిలువ పూర్తి ఆథిపత్యంలో ఉంది. ఇంతలో ఓ నక్క అక్కడికి ఎంట్రీ ఇచ్చి.. కొండచిలువను ఇబ్బంది పెట్టింది. దీంతో సిట్యువేషన్‌ను తనకు అనుకూలంగా మలుచుకున్న హనీ బ్యాడ్జర్.. పూర్తి ఆధిపత్యం చలాయించింది.
అయితే, పోరాటం అక్కడితో ఆగలేదు. కొండచిలువను దక్కించుకునేందుకు ఇటు నక్క.. అటు హనీ బ్యాడ్జర్ వార్‌కి దిగాయి. ఈ లోపు మరో నక్క అక్కడికి ఎంటరయింది. పైథాన్ కోసం నక్కలు, హనీ బ్యాడ్జర్ మధ్య భీకరమైన పోరు సాగింది. హనీ బ్యాడ్జర్ ఎంతో ధైర్యంగా నక్కలను ఎదుర్కొంటూ, అదే సమయంలో పైథాన్‌ను తన వశం చేసుకోవడానికి ప్రయత్నించింది. హనీ బ్యాడ్జర్ డేర్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్, దాని భయానక పోరాట తీరు గురించి చెప్పేది ఏముంది. అందుకే అంతిమ విజయం దానిదే. పట్టుదల, సమన్వయంతో పోరాడి ఆ పైథాన్‌ను ఓ పొదలోకి హనీ బ్యాడ్జర్ లాక్కెళ్లింది. నక్కలు మాత్రం నిరాశతో ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాయి. ఇది ప్రకృతిలోని జీవన పోరాటానికి నిదర్శనం.
వీడియో క్రెడిట్: Caters Video
