ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య దేశంలో తగ్గుతున్న జననాల రేటు. తగ్గుతున్న జనాభా సమస్య ఇప్పుడు చైనా ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రేపటి భావి తరాన్ని పెంచేందుకు చైనా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి తాజాగా చైనా ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ‘ప్రేమ విద్య’ (Love Education) కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని పరిశీలిస్తోంది. ఇది వివాహం, ప్రేమ, కుటుంబ జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
చైనా వరుసగా రెండవ సంవత్సరం జనాభా క్షీణతను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దీని కారణంగా ప్రభుత్వ వనరులు, ఆర్థిక వ్యవస్థపై వృద్ధ జనాభా ప్రభావం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి.
సుమారు 1.4 బిలియన్ల అంటే 140 కోట్ల జనాభాతో చైనా ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభాగా గుర్తింపు పొందింది. అయితే ఇక్కడ వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. అటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో దేశ జనాభా అభివృద్ధిలో కళాశాల విద్యార్థులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ప్రభుత్వం విశ్వసిస్తోంది. సంబంధాలు, వివాహం, కుటుంబంపై వారి అభిప్రాయాలు మారాలని ప్రభుత్వం భావిస్తోంది.
చాలా మంది యువత ఇప్పుడు సంసారం, భార్యభర్తల సంబంధాలను కొనసాగించడంలో వెనుకాడుతున్నారని ఒక వార్తాపత్రిక కథనం తెలిపింది. అటువంటి పరిస్థితిలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రేమ, పెళ్లికి సంబంధించి ప్రత్యేక పాఠ్యాంశాలను అందించాల్సిన అవసరం ఉంది. వివాహం, పిల్లల్ని కనేందుకు అనుకూలమైన సాంస్కృతిక వాతావరణాన్ని ప్రోత్సహించడం ఈ ప్రయత్నం లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..