పెంపుడు పిల్లితో ఆడుకుంటూ ఐసీయూలో పడ్డ ఎనిమిదేళ్ల బాలుడు.. పరిస్థితి చూసి డాక్టర్లకే ముచ్చెమటలు!
ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులను, ముఖ్యంగా పిల్లులను పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. పిల్లులతో ఆడుకోవడం, వాటితో కలిసి పడుకోవడం చాలామందికి అలవాటు. అయితే ఈ క్రమంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తెస్తుందని కోల్‌కతాలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. పిల్లి గీరడం వల్ల ఎనిమిదేళ్ల బాలుడు తీవ్ర నరాల సమస్యతో ఆస్పత్రిలోని ఐసీయూ పాలైన ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

సాధారణంగా ఇళ్లలో పెంపుడు పిల్లులు గీరడం లేదా కరవడం సహజంగానే భావిస్తారు. కానీ, ఆ చిన్నపాటి గీకుడు ఒక్కోసారి ప్రాణాల మీదికి తీసుకువస్తుందని కోల్‌కతాలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. సౌత్ కోల్‌కతాకు చెందిన ఒక ఎనిమిదేళ్ల బాలుడు పిల్లి గీరడం వల్ల తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలోని పీడియాట్రిక్ ఐసీయూ పాలయ్యాడు.
ఫిట్స్‌తో ప్రారంభమై వెంటిలేటర్ వరకు…
జులై 10న బాలుడికి అకస్మాత్తుగా తీవ్రమైన మూర్ఛ రావడంతో తల్లిదండ్రులు వెంటనే పియర్లెస్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బాలుడికి వరుసగా స్పృహ రాకుండా ఎక్కువ సమయం పాటు ఫిట్స్ రావడం ప్రారంభమైంది. దీనిని వైద్యభాషలో స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు. పలు రకాల ఫిట్స్ మందులు ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో, వైద్యులు బాలుడిని పీడియాట్రిక్ ఐసీయూకి మార్చి, వెంటిలేటర్‌పై ఉంచి కృత్రిమ శ్వాస అందించారు.
వ్యాధి నిర్ధారణలో డాక్టర్ల సవాలు:
మొదట్లో బ్రెయిన్, వెన్నుపాము ద్రవ పరిక్షల్లో వ్యాధికి సంబంధించిన స్పష్టమైన కారణాలు ఏవీ బయటపడలేదు. దీంతో వైద్యులు ఈ వ్యాధిని NORSE (న్యూ-ఆన్‌సెట్ రిఫ్రాక్టరీ స్టేటస్ ఎపిలెప్టికస్) అనే అరుదైన నరాల వ్యాధిగా అనుమానించారు. అయితే బాలుడికి జ్వరం రావడం, అతని తల్లిదండ్రులను లోతుగా విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాలుడు రోజూ పిల్లితో కలిసి పడుకునేవాడని, మూర్ఛలు రావడానికి 10 రోజుల ముందు బాలుడి చర్మంపై ఎర్రటి మచ్చలు రావడం, ఎడమ చంకలో లింఫ్ నోడ్ వాపు రావడం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించగా బార్టోనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల క్యాట్ స్క్రాచ్ డిసీజ్ వచ్చినట్లు స్పష్టమైంది.
సాధారణంగా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తేలికపాటి జ్వరంతో ముగుస్తుంది. కానీ, అరుదైన కేసుల్లో ఇది మెదడు, నాడీ వ్యవస్థపై దాడి చేసి ప్రాణాపాయ స్థితికి దారితీస్తుందని పీడియాట్రీషియన్ డాక్టర్ శుభ్రాంశు శేఖర్ సర్కార్ తెలిపారు. సరియైన యాంటీబయోటిక్ చికిత్స అందించడంతో బాలుడి ఆరోగ్యం మెరుగైంది. 5 రోజుల తర్వాత వెంటిలేటర్ తొలగించగా, 10 రోజుల అనంతరం బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పిల్లులు కరిచినా లేదా గీరినా, ఆ ప్రాంతాన్ని వెంటనే సబ్బు, మంచి నీటితో శుభ్రంగా కడగాలి. పిల్లులను పట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో పిల్లులకు పేన్లు/పిడుదులు పడకుండా వెటర్నరీ వైద్యుల సలహాతో మందులు వాడాలి. పిల్లలను పెంపుడు జంతువులతో ఆడుకునేటప్పుడు పర్యవేక్షించడం శ్రేయస్కరం.




