ఆడవాళ్లను చూడగానే ఎగిరిపోతున్న పక్షులు.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు

పక్షులకు ఆడవారంటే భయమా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేనంటున్నారు సైంటిస్టులు. మగవారు దగ్గరకు వచ్చినా ధైర్యంగా ఉండే పక్షులు, ఆడవారు రాగానే ఎందుకు ఉలిక్కిపడుతున్నాయి? పక్షులు మనల్ని ఎలా గుర్తుపడుతున్నాయి? ఈ క్రేజీ రీసెర్చ్ వివరాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆడవాళ్లను చూడగానే ఎగిరిపోతున్న పక్షులు.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు
Why Birds Fear Women More Than Men

Updated on: May 15, 2026 | 11:50 AM

ప్రకృతిలో పక్షుల ప్రవర్తన ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అయితే తాజాగా అంతర్జాతీయ పరిశోధకుల బృందం యూరప్‌లోని పట్టణ పక్షులపై చేసిన ఒక అధ్యయనంలో ఒక విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. పక్షులు మగవారి కంటే ఆడవారిని చూస్తేనే ఎక్కువ భయపడి, త్వరగా ఎగిరిపోతున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. పీపుల్ అండ్ నేచర్ పత్రికలో ప్రచురితమైన ఈ కథనం ఇప్పుడు శాస్త్రవేత్తల మధ్య చర్చకు దారితీసింది. పరిశోధకులు పక్షుల భయాన్ని కొలవడానికి ఎగరడానికి పట్టే దూరం అనే కొలమానాన్ని ఉపయోగించారు. అంటే ఒక మనిషి పక్షికి ఎంత దగ్గరకు వెళ్తే అది ఎగిరిపోతుంది అనేదానిపై వారు నిశితంగా పరిశీలన చేశారు. ఐదు వేర్వేరు దేశాల్లోని 37 రకాల పక్షి జాతులపై ఈ ప్రయోగం చేయగా.. సగటున మగవారు సమీపించినప్పుడు పక్షులు మూడు అడుగుల కంటే ఎక్కువ దగ్గరకు రానిచ్చాయి. కానీ ఆడవారు సమీపిస్తున్నప్పుడు మాత్రం అవి అంతకంటే ముందే భయపడి ఎగిరిపోయాయి.

మగ, ఆడ తేడాను పక్షులు ఎలా గుర్తిస్తున్నాయి?

పరిశోధనలో పాల్గొన్న మగ, ఆడవారు దాదాపు ఒకే ఎత్తు, బరువు కలిగి ఉన్నప్పటికీ, పక్షులు వారి మధ్య తేడాను స్పష్టంగా గుర్తించగలిగాయి. మనుషుల నడక తీరు, బాడీ, జుట్టు పొడవు వంటి సూక్ష్మమైన తేడాలను పక్షులు పసిగడుతున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. పక్షులు కంటిచూపుతో పాటు వాసన ద్వారా కూడా లింగ భేదాన్ని గుర్తిస్తున్నాయేమో అనే అనుమానాలు ఉన్నాయి. మగ, ఆడవారి నుంచి వెలువడే రసాయన సంకేతాలు పక్షులకు ఒక సంకేతాన్ని ఇస్తుండవచ్చు.

ఆడవారికే ఎందుకు ఎక్కువ భయం?

ఈ రహస్యం వెనుక ఉన్న అసలు కారణంపై పరిశోధకులకు ఇంకా నిశ్చయాత్మకమైన వివరణ లేదు. అయితే ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని వారు ముందుకు తెచ్చారు. ‘‘పరిణామ క్రమంలో పూర్వ కాలంలో మగవారు పెద్ద ఎరను వేటాడేవారు. కానీ ఆడవారు పక్షుల వంటి చిన్న చిన్న జీవులను వేటాడి చంపే బాధ్యతను కలిగి ఉండేవారు. అనేక తరాలుగా సాగిన ఈ ప్రక్రియ వల్ల ఆడవారిని చూడగానే పక్షుల్లో ఒక రకమైన సహజ భయం ఏర్పడి ఉండవచ్చు” అని చెబుతున్నారు.

ఇంకా వీడని చిక్కుముడి

UCLAకు చెందిన అధ్యయన రచయిత డేనియల్ బ్లూమ్‌స్టీన్ మాట్లాడుతూ.. “మా పరిశోధన ఫలితాలు అన్ని దేశాల్లోనూ స్థిరంగా ఉన్నాయి. కానీ పక్షులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయో చెప్పడానికి ఇంకా బలమైన వివరణ అవసరం” అని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరణలు కొంత అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ, పక్షుల మెదడు మనల్ని ఎలా చూస్తుంది అనే విషయంలో ఇదొక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు.

Follow Us