AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనకు కలలు ఎందుకు వస్తాయి.. నిద్రలేవగానే ఎందుకు మర్చిపోతాం..? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

మనం రోజూ కనే కలలు.. కొన్ని రంగుల లోకంలోకి తీసుకెళ్తే, మరికొన్ని భయంతో చెమటలు పట్టిస్తాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిద్రలేచిన ఐదు నిమిషాలకే మనం కన్న కలలో సగానికి పైగా మర్చిపోతాం.. అసలు ఈ మాయా ప్రపంచాన్ని మన మెదడు ఎందుకు సృష్టిస్తుంది? మనం నిద్రపోయాక లోపల జరిగే ఆ కెమికల్ రియాక్షన్ ఏంటీ? కలల వెనుక దాగి ఉన్న విస్తుపోయే నిజాలు తెలుసుకుందాం..

మనకు కలలు ఎందుకు వస్తాయి.. నిద్రలేవగానే ఎందుకు మర్చిపోతాం..? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Why Do We Forget Dreams
Krishna S
|

Updated on: May 15, 2026 | 8:32 AM

Share

మనమందరం కలలు కంటాం. కొన్ని కలలు వింతగా ఉంటే, మరికొన్ని భయాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. అసలు ఈ కలలు ఎందుకు వస్తాయి? మెదడు వీటిని ఎలా సృష్టిస్తుంది? నిద్రలేవగానే అవి మాయం ఎందుకు అవుతాయి? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన శాస్త్రీయ రహస్యాలను పరిశోధకులు వెల్లడిస్తున్నారు. నిద్రలో ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ అనే దశలో కలలు వస్తాయి. ఈ సమయంలో మన కనుగుడ్లు వేగంగా కదులుతుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ దశలో మన మెదడు మనం మేల్కొని ఉన్నప్పటి కంటే కొన్నిసార్లు ఎక్కువ చురుకుగా పనిచేస్తుంది. ముఖ్యంగా జ్ఞాపకాలకు కేంద్రమైన హిప్పోకాంపస్, భావోద్వేగాలను నియంత్రించే అమిగ్డాలా అతి చురుకుగా మారడం వల్ల మన కలలు భావోద్వేగాలతో నిండి ఉంటాయి.

మెదడు ఎందుకు కలలను సృష్టిస్తుంది?

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కలలు అనేవి మన మెదడు చేసే డేటా ప్రాసెసింగ్. రోజంతా మనం చూసిన, విన్న విషయాలను మెదడు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి, పాత జ్ఞాపకాలతో మిళితం చేస్తుంది. భయం, ఆందోళన లేదా ఉత్సాహాన్ని కలిగించే విషయాలను మెదడు నిద్రలో ప్రాసెస్ చేస్తుంది. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు పీడకలలు ఎక్కువగా వస్తుంటాయి.

కలలు ఎందుకు మర్చిపోతాం?

కలలు కన్న 5 నుండి 10 నిమిషాల వ్యవధిలోనే మనం వాటిని మర్చిపోతుంటాం. దీనికి ప్రధాన కారణాలు..

కెమికల్ లోపం: REM నిద్ర సమయంలో మెదడులో జ్ఞాపకాలను నిల్వ చేసే నోర్‌పినెఫ్రిన్ అనే రసాయన స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి.

షార్ట్ టర్మ్ మెమరీ: మన మెదడు కలలను దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మార్చదు. హిప్పోకాంపస్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఆ వివరాలు మసకబారిపోతాయి.

మేల్కొనే విధానం: మీరు REM నిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొంటే కల గుర్తుండే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ నిద్రలోకి జారుకుంటే అది శాశ్వతంగా మాయమవుతుంది.

మీకు తెలుసా?

ప్రతి ఒక్కరూ కలలు కంటారు: ఒక రాత్రిలో మనం సగటున 4 నుండి 6 కలలు కంటాం. కానీ అందులో 95శాతం పైగా మర్చిపోతాం.

బ్లాక్ అండ్ వైట్ కలలు: పూర్వం బ్లాక్ అండ్ వైట్ టీవీలు చూసే కాలంలో చాలా మందికి నలుపు-తెలుపు కలలే వచ్చేవి. ఇప్పుడు కలర్ టీవీల యుగంలో రంగుల కలలు వస్తున్నాయి.

ముఖాలు: మనం కలల్లో చూసే వ్యక్తులు మన జీవితంలో ఎక్కడో ఒకచోట చూసినవారే అయి ఉంటారు. మన మెదడు కొత్త ముఖాలను సృష్టించలేదు.

కలలు గుర్తుండాలంటే?

మీరు కన్న కల గుర్తుండాలంటే, నిద్రలేవగానే కదలకుండా అలాగే పడుకుని ఆ కలను గుర్తుకు తెచ్చుకోవాలి. లేదా పక్కనే ఒక డైరీ ఉంచుకుని వెంటనే రాసుకోవాలి. కాగా కలలు అనేవి కేవలం ఊహలు కావు, అవి మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఒక సహజ ప్రక్రియ. అవి మన భావోద్వేగాలను సరిచేసి, మరుసటి రోజుకు మనల్ని సిద్ధం చేస్తాయి.

Follow Us