AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ వర్షమే.. మన దేశంలోని ఈ ఊరు గురించి తెలుసా..? ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం..

వర్షం పడితే రెండు రోజులు మురిసిపోతాం.. అదే వారం రోజులు పడితే బాబోయ్ వాన అంటాం.. కానీ ఒక ఊరిలో సంవత్సరంలో దాదాపు ప్రతిరోజూ వర్షం కురుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు మనమంతా చిరపుంజిలోనే ఎక్కువ వర్షం పడుతుంది అనుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు ఆ రికార్డును మన దేశంలోని మరో గ్రామం బద్దలు కొట్టింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రోజూ వర్షమే.. మన దేశంలోని ఈ ఊరు గురించి తెలుసా..? ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం..
Highest Rainfall In India Mawsynram
Krishna S
|

Updated on: Jun 02, 2026 | 1:09 PM

Share

వర్షం అనే మాట వినగానే మనకందరికీ ఒకలాంటి సంతోషం, హాయి కలుగుతుంది. మండే ఎండల నుండి ఉపశమనం కలిగిస్తూ ఆకాశం నుండి పడే వాన చినుకులు మనసును చల్లబరుస్తాయి. అయితే ఒక సీజన్‌లో మాత్రమే వర్షం వస్తేనే మనకు ఇంత ఆనందంగా ఉంటుంది కదా.. మరి సంవత్సరంలో దాదాపు ప్రతిరోజూ, ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంటే ఆ ఊరి జనం జీవితం ఎలా ఉంటుంది? దేశంలో అలాంటి వింతైన, అద్భుతమైన ప్రదేశం ఒకే ఒక్కటి ఉంది. అక్కడ వర్షం అనేది ఒక రుతువు కాదు.. అది వారి జీవితంలో ఒక భాగం.

చిరపుంజి రికార్డును దాటేసిన మావ్సిన్‌రామ్

మన దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనగానే మనకు మొదటగా గుర్తొచ్చే పేరు చిరపుంజి. కానీ ఇప్పుడు ఆ పాత రికార్డును మేఘాలయలోని మావ్సిన్‌రామ్ అనే ఒక చిన్న గ్రామం అధిగమించింది. విశేషం ఏంటంటే.. మావ్సిన్‌రామ్, చిరపుంజి రెండూ మేఘాలయ రాష్ట్రంలోనే కేవలం సుమారు 16 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. చాలా స్వల్ప తేడాతో చిరపుంజి కంటే మావ్సిన్‌రామ్‌లోనే అత్యధిక వర్షపాతం కురుస్తుంది. గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం.. ఇక్కడ ప్రతి సంవత్సరం సగటున ఏకంగా 11,871 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రపంచంలోని మరే ఇతర ప్రదేశంలోనూ నమోదు కానంత అత్యధిక వర్షపాతం కావడం విశేషం.

6 నెలల్లోనే ఆకాశానికి చిల్లు పడుతుంది

ఇక్కడ సంవత్సరం పొడవునా 365 రోజులూ కుండపోత వర్షం కురవదు కానీ, దాదాపు ప్రతిరోజూ తేలికపాటిగానో లేదా భారీగానో చినుకులు పడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ కురిసే మొత్తం వార్షిక వర్షపాతంలో 90 శాతం వాన కేవలం 6 నెలల కాలంలోనే కురుస్తుంది. ముఖ్యంగా జూలై నెలలో ఇక్కడ కురిసే వర్షాలను చూస్తే ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అన్నట్టుగా భయానకంగా ఉంటుంది.

అసలు ఇక్కడే ఎందుకు అంత వర్షం కురుస్తుంది?

మావ్సిన్‌రామ్ గ్రామం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఖాసీ కొండలలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1,491 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంత భౌగోళిక స్వరూపమే ఇందుకు ప్రధాన కారణం. బంగాళాఖాతం నుండి వచ్చే వెచ్చని, తేమతో కూడిన రుతుపవన గాలులు ఈ ఖాసీ కొండలను బలంగా తాకినప్పుడు ఆ గాలి ఒక్కసారిగా పైకి లేచి చల్లబడుతుంది. దీనివల్ల అక్కడ దట్టమైన మేఘాలు ఏర్పడి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తాయి. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రదేశంగా నిలిచింది.

ఇక్కడి ప్రజల జీవనశైలి.. ఆ గొడుగులు చాలా వింత

నిరంతరం వర్షం కురుస్తున్నా ఇక్కడి ప్రజలు తమ పనులను అస్సలు ఆపరు. ఇక్కడ గొడుగు అత్యవసరం. అయితే సాధారణ గొడుగులు ఇక్కడి భారీ వర్షాలకు తట్టుకోలేవు కాబట్టి స్థానికులు వెదురు, అరటి ఆకులతో చేసిన కనూప్స్ అనే ప్రత్యేకమైన గొడుగులను ధరిస్తారు. ఇవి చూడటానికి తాబేలు వీపు లాగా ఉండి తల నుండి మోకాళ్ల వరకు శరీరం మొత్తాన్ని కప్పుతాయి. వీటిని తగిలించుకుని వారు వర్షంలో కూడా సులభంగా చేతులతో పనులు చేసుకోగలరు. ఇక్కడ ఎప్పుడూ వరదల్లా ప్రవహించడం వల్ల వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. అయినప్పటికీ, ఇక్కడి నేల చాలా సారవంతమైనది కావడం వల్ల ప్రజలు తేయాకు, నారింజ వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు.

మావ్సిన్‌రామ్ అంటే అర్థం ఏంటి?

స్థానిక ఖాసీ భాషలో మావ్సిన్‌రామ్ అనే పేరులో.. మో అంటే రాయి అని, సిన్‌రామ్ అంటే అంచు అని అర్థం. మొత్తంగా చూస్తే రాళ్ల అంచు అని దీని అర్థం వస్తుంది. నిరంతర వర్షాల వల్ల ఇక్కడి సాధారణ జీవితం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ, చుట్టూ ఉండే అంతులేని పచ్చదనం, జలపాతాలు, సహజ సౌందర్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రకృతిని దాని అసలైన సహజ రూపంలో చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.

Follow Us